డోంట్ మిస్..అవార్డ్ విన్నింగ్ వెబ్ సిరీస్
దిశ, వెబ్‌డెస్క్: 2020లో కరోనా మహమ్మారి అందరినీ ఎంతగా భయపెట్టిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్, ఆ తర్వాత కూడా దేశ ప్రజల్లో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయంలో వారికి ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ఓటీటీల్లో సూపర్ కంటెంట్స్ వచ్చాయి. అలా వచ్చిన వాటిలో కొన్ని వెబ్ సిరీస్, సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో ఈ ఏడాది అవార్డులు గెలుచుకుని సత్తా చాటాయి. ఆ జాబితాలో ఉన్న సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.. ఢిల్లీ […]
దిశ, వెబ్‌డెస్క్: 2020లో కరోనా మహమ్మారి అందరినీ ఎంతగా భయపెట్టిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్, ఆ తర్వాత కూడా దేశ ప్రజల్లో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయంలో వారికి ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ఓటీటీల్లో సూపర్ కంటెంట్స్ వచ్చాయి. అలా వచ్చిన వాటిలో కొన్ని వెబ్ సిరీస్, సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో ఈ ఏడాది అవార్డులు గెలుచుకుని సత్తా చాటాయి. ఆ జాబితాలో ఉన్న సినిమాలేంటో ఓ లుక్కేద్దాం..
ఢిల్లీ క్రైమ్: 48వ ఇంటర్నేషనల్ ఎమ్మి అవార్డ్స్‌లో ‘ఢిల్లీ క్రైమ్’ బెస్ట్ డ్రామా సిరీస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. దేశ రాజధానిలో 2012లో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచార ఘటన ఆధారంగా ‘ఢిల్లీ క్రైమ్’ తెరకెక్కింది. ఇండియన్-కెనడియన్ డైరెక్టర్ రిచీ మెహతా దీనికి దర్శకత్వం వహించగా, షెఫాలి షా, రసిక దుగ్గల్, ఆదిల్ హుస్సేన్, రాజేష్ తైలాంగ్ నటించారు.
ద ఫ్యామిలీ మ్యాన్: మనోజ్ బాజ్‌పాయ్ లీడ్ రోల్ పోషించిన వెబ్ సిరీస్ ఇది. ఇందులో ప్రియమణి, మనోజ్ భార్యగా నటించింది. ఈ అమెజాన్ వెబ్ సిరీస్ ‘ఆసియన్ అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్’లో నాలుగు అవార్డ్స్‌ను సొంతం చేసుకుంది. ఇండియాపై టెర్రరిస్ట్ అటాక్స్ నేపథ్యంలో దీన్ని తెరకెక్కించారు. రియల్ లైఫ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఆధారంగా ఈ కథను రాజ్ అండ్ డీకే సిద్ధం చేసుకున్నారు. రెండో సీజన్‌లో అక్కినేని సమంత నెగెటివ్ రోల్‌లో నటించబోతుంది.
ఫోర్ మోర్ షార్ట్స్ 2: బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆసియన్ కంటెంట్ అవార్డ్ అందుకుంది ఈ వెబ్ సిరీస్. అంతేకాదు 6వ వెబ్ సిరీస్ ఫెస్టివల్ గ్లోబల్‌లో బెస్ట్ వెబ్ సిరీస్ అవార్డ్ గ్రాబ్ చేసింది. సయాని గుప్తా (దామిని), బని జె (ఉమాంగ్), కృతి కులకర్ణి (అంజనా), మాన్వి గ్యాంగ్రూ (సిధి పటేల్) అనే నలుగురు అమ్మాయిల కథల సమాహారమే ఈ వెబ్ సిరీస్. ఒక్కోక్కరిది ఒక్కో కథ.
ద డిసైపుల్: ఒక యువ సంగీత దర్శకుడి సినీప్రయాణమే ‘ది డిసైపుల్’. కష్టాలను ఎదుర్కొని లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నదే కథ. ఈ చిత్రం వెన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండు అవార్డులు దక్కించుకుంది. మరాఠీ డైరెక్టర్ చైతన్య తమ్హా దర్శకుడు.
మాయి ఘాట్: క్రైమ్ నెం 103/2005 : 2005లో కేరళకు చెందిన ఉదయ్ కుమార్ అనే యువకుడు పోలీస్ కస్టడీలో చనిపోగా, అతడి తల్లి ప్రభావతి అమ్మ 13 ఏళ్లు న్యాయపోరాటం చేసి గెలిచింది. ఆ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మరాఠీ చిత్రంలో ఉషా జాదవ్ లీడ్ రోల్ పోషించింది. ఇండో జర్మన్ ఫిల్మ్ ఉత్సవాల్లో ఆమెకు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది.
బెంగాలీ షార్ట్ ఫిల్మ్ ‘ఎటర్నల్ కాన్వస్’కు పలు విభాగాల్లో హాలీవుడ్ గోల్డ్ అవార్డ్ (2020), యూరోప్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులు లభించాయి. మరాఠీ చిత్రం ‘పగ్ల్యా’ మల్టీపుల్ అవార్డ్స్ గెలుచుకుంది. లాస్ఏంజిల్స్‌లో జరిగిన వరల్డ్ ప్రీమియర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టెర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రస్, బెస్ట్ మ్యూజిక్ ట్రోఫీస్ గెలుచుకుంది.
‘బిరియాని’ చిత్రంలోని నటి కని కస్తూరి మాడ్రిడ్‌లో జరిగిన ఇమాజిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ద్వితీయ ఉత్తమ నటి అవార్డ్ అందుకుంది. రాధికా ఆప్టే దర్శకత్వం వహించిన తొలి షార్ట్ ఫిల్మ్ ‘ద స్లీప్ వాకర్స్’ పాల్మ్స్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫెస్ట్‌లో ‘ద బెస్ట్ మిడ్ నైట్ షార్ట్’ అవార్డ్ గెలుచుకుంది. పరీక్ష, నిర్వాన ఇన్ చిత్రాల్లో నటనకు గానూ బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ ఇండో జర్మన్ ఫిల్మ్ వీక్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు.