మావోయిస్టుల కుట్రను భగ్నం చేసిన పోలీసులు..

మావోయిస్టుల కుట్రను పోలీసు బలగాలు భగ్నం చేశాయి. మావోలు అమర్చిన 15 ఐఈడీ బాంబులను గుర్తించిన పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు.

Update: 2024-12-23 09:07 GMT

దిశ, చర్ల : మావోయిస్టుల కుట్రను పోలీసు బలగాలు భగ్నం చేశాయి. మావోలు అమర్చిన 15 ఐఈడీ బాంబులను గుర్తించిన పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు. వివరాల్లోకెళితే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం, నారాయణపూర్ జిల్లా కచ్చపాల్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ కు వచ్చే పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు 15 ఐఈడీ బాంబులను అమర్చారు.

రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఐఈడీ బాంబు పేలి ఇద్దరు జవాన్లు గాయపడిన సంఘటనతో అప్రమత్తమైన పోలీసు డీఆర్జీ, బీఎస్ఎఫ్ బలగాలు బాంబు స్క్వాడ్ బృందాలతో కలిసి కచ్చపాల్ అడవుల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 15 ఐఈడీ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క ఐఈడీ సుమారు 5 కిలోల బరువున్నాయని పేర్కొన్నారు. వీటితో పాటు పేలుడు పదార్థాలకు సంబంధించిన విద్యుత్ తీగలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీన పరుచుకున్న ఐఈడీలను భద్రతా పర్యవేక్షణ నడుమ నిర్వీర్యం చేశారు.


Similar News