INDIA Bloc: కాంగ్రెస్ అందుకు రెడీగా ఉండాలి.. మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేత, కేంద్రమాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్(Mani Shankar Aiyar) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ నేత, కేంద్రమాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్(Mani Shankar Aiyar) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్(Congress).. ఇండియా కూటమి(INDIA Bloc) నాయకత్వాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమికి ఎవరు నాయకుడిగా ఉండాలనుకుంటున్నారో వారిని ఉండనివ్వాలని సూచించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి(Mamata Banerjee) కూటమికి నాయకత్వం వహించే సమర్థత ఉందన్నారు. ఆమెతో పాటు మరికొందరికి కూడా కూటమిని నడిపించే సామర్థ్యం ఉందన్నారు.
ఎవరు నాయకుడైనా పట్టించుకోను
ఇండియా కూటమికి ఎవరు నాయకైనా పట్టించుకోనని మణిశంకర్ అయ్యర్ అన్నారు. కాంగ్రెస్ నాయకుడికి, కాంగ్రెస్ పార్టీ స్థానం ఎల్లప్పుడూ ప్రధానమైనదిగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) కూటమికి అధ్యక్షుడిగా ఉండే దానికంటే.. మామూలు నాయకుడిగా ఉంటేనే ఆయన్ని ఎక్కువ గౌరవంతో చూస్తారని కచ్చితంగా అనుకుంటున్నానని అన్నారు. మరోవైపు, లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న ఇండియా కూటమి.. ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ సమయంలో మమతా బెనర్జ.. కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు. అవకాశం లభిస్తే కూటమిని సమర్థమంతంగా నడిపిస్తానని అన్నారు. కాగా.. సీనియర్ నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్ సైతం దీదీకి మద్దతిచ్చారు.