పీఆర్సీ.. నో క్లారిటీ.. ప్రభుత్వం చెక్ పెట్టిందా..?
పీఆర్సీ.. ఓ ఒడువని ముచ్చటగానే మారనుందా..? ఆర్టీసీ పంథాలోనే యూనియన్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం యతిస్తున్నదా..? అంటే ఔననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లోని ఐక్యతాలోపాన్నే సర్కారు ఆయుధంగా మార్చుకొనే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. అన్ని సంఘాలతో చర్చలు జరుపుతామన్న త్రిసభ్య కమిటీ ప్రకటనే ఇందుకు ప్రధాన ఆధారం. ప్రస్తుత పరిస్థితిలో 150కి పైగా ఉన్న సంఘాలతో చర్చలు జరపాల్సి ఉంటుంది. దాదాపు 100 సంఘాలు చర్చలకు వెళ్తామంటున్నాయి. చర్చల పేరుతో కాలయాపన చేసి ఫిట్మెంట్ […]
పీఆర్సీ.. ఓ ఒడువని ముచ్చటగానే మారనుందా..? ఆర్టీసీ పంథాలోనే యూనియన్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం యతిస్తున్నదా..? అంటే ఔననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లోని ఐక్యతాలోపాన్నే సర్కారు ఆయుధంగా మార్చుకొనే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. అన్ని సంఘాలతో చర్చలు జరుపుతామన్న త్రిసభ్య కమిటీ ప్రకటనే ఇందుకు ప్రధాన ఆధారం. ప్రస్తుత పరిస్థితిలో 150కి పైగా ఉన్న సంఘాలతో చర్చలు జరపాల్సి ఉంటుంది. దాదాపు 100 సంఘాలు చర్చలకు వెళ్తామంటున్నాయి. చర్చల పేరుతో కాలయాపన చేసి ఫిట్మెంట్ అంశాన్ని అటకెక్కించే అవకాశాలున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగ సంఘాల డిమాండ్… ప్రభుత్వానికి సాకుగా దొరికింది. ఫిట్మెంట్ నిర్ణయం ఆలస్యానికి వారినే కారణంగా చూపిస్తోంది. ఇప్పట్లో పీఆర్సీపై తేలదని చెప్పకనే చెప్పుతోంది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలన్నింటితోనూ చర్చలు జరిపేందుకు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం వేతన సవరణ ఫిట్మెంట్ మరింత జాప్యం కానుంది. దీనిలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. వారి చేతులు వారిపైనే పెట్టింది. తాజా పరిణామాలతో ఉద్యోగ సంఘాలపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫిట్మెంట్ ఆలస్యానికి కారణం.. సంఘాలే అంటూ విమర్శలు మొదలయ్యాయి. అప్పుడు ఆర్టీసీ యూనియన్లను బద్నాం చేసి… వాటి ఉనికి లేకుండా చేసినట్టుగానే… ఈసారి కూడా ప్రభుత్వం అదే పంథా అమలు చేస్తోందా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
మీ కారణంగానే ఆలస్యం
వేతన సవరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటిదాకా కేవలం గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతోనే త్రిసభ్య కమిటీ సమావేశమవుతుందని ప్రకటించింది. పీఆర్సీ నివేదికపై సీఎస్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగులతో మళ్లీ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. గత నెల 27 నుంచి చర్చలు మొదలుపెట్టింది. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలంటే దాదాపు 16 వరకు ఉంటాయని భావించారు. దీనిలో భాగంగా తొలి రోజున మూడు, మరునాడు 8, ఆ తర్వాత ఐదారు సంఘాలతో చర్చలు జరిపారు. అందరిదీ ఫిట్మెంట్ పెంపు డిమాండే. గత నెల 30నాడే త్రిసభ్య కమిటీ నివేదిక సీఎంకు వెళ్తుందని భావించారు. కానీ ఎట్టకేలకు సాగదీశారు. మరోవైపు ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ పెంపుపై నిరసనలు చేస్తూనే ఉన్నాయి. ఇదే ప్రభుత్వానికి అవకాశంగా మారింది. వాస్తవంగా గతంలో పీఆర్సీపై ఉద్యోగ సంఘాల జేఏసీ నుంచి ప్రతినిధులను పిలిచి ఒకేసారి చర్చించి ప్రకటన చేసేవారు. కానీ ఈసారి కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మళ్లీ సీఎస్‌తో పాటుగా ఆర్థిక, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో త్రిసభ్య కమిటీ వేసి మళ్లీ చర్చలకు నిర్ణయించారు. మళ్లీ వినతులు స్వీకరించారు. ఇది అనవసరమంటూ పలువురు సూచించారు. కానీ త్రిసభ్య కమిటీ మాత్రం చర్చల్లో నిమగ్నమైంది. అయితే ఆయా ఉద్యోగ సంఘాలు కూడా తమతో చర్చలు పిలువాలని నిరసనల్లో డిమాండ్ చేశాయి.
150కిపైగా సంఘాలతో చర్చలు సాధ్యమేనా..?
ఎలాగైనా ఫిట్‌మెంట్‌పై చర్చలు ఆలస్యమవుతున్నాయనే కారణంతో ప్రభుత్వ డైరెక్షన్లో త్రిసభ్య కమిటీ ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలన్నింటితోనూ చర్చలు సాగిస్తామని ప్రకటించింది. దీనికి షెడ్యూల్ ఖరారు చేయాలని ఆదేశాలిచ్చారు. అంటే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలన్నింటితోనూ చర్చలు సాగిస్తామని త్రిసభ్య కమిటీ నుంచి సీఎస్ వెల్లడించారు. ఈ లెక్కన దాదాపు 150కిపైగా ఉద్యోగ సంఘాలున్నాయి. ఉద్యోగ జేఏసీలోనే 126 సంఘాలున్నాయి. ప్రస్తుతం జేఏసీగా కాకుండా అన్ని సంఘాలతో చర్చలు జరపాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా సంఘాలు తమ వాయిస్‌ను వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. జేఏసీ కాకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉన్నాయి. అంటే దాదాపుగా 150 ఉద్యోగ సంఘాలు ఇప్పుడున్నాయి. వీటిలో త్రిసభ్య కమిటీతో చర్చలకు సుమారు 100 సంఘాల వరకు సిద్ధంగానే ఉన్నాయి.
చేతులెత్తేస్తున్నారా..?
ఇక ఉద్యోగ సంఘాల్లో నిస్తేజం బయటకు వస్తోంది. ఉద్యోగ సంఘాల వ్యవహారంతోనే పీఆర్సీ ఆలస్యమవుతున్నదనే ఆరోపణలున్నాయి. ఇంకా బహిరంగ విమర్శలకు దిగకపోయినా… ఒక సంఘంపై ఇంకో సంఘం ఆరోపణలు చేస్తూనే ఉన్నది. ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ అంశాన్ని పక్కన పెట్టాయని, కేవలం త్రిసభ్య కమిటీని కలువాలనే ఉద్దేశంతోనే ఉంటున్నాయంటున్నారు. త్రిసభ్య కమిటీతో చర్చలకు వెళ్లకుంటే తమ యూనియన్‌పై చిన్నచూపు ఉంటుందనే కారణంతో ఉన్నారని సంఘాల నేతలు చెప్పుతున్నారు.
ఇక ఆర్టీసీ పంథానా..?
ఆర్టీసీ సమ్మె సమయంలో ప్రభుత్వం యూనియన్లు లేకుండా చేయడంలో సక్సెస్ అయింది. సమ్మెకు దిగిన కార్మికులతోనే యూనియన్ల లీడర్లపై విమర్శలు చేసే విధంగా చేసిన ప్లాన్ విజయవంతం అయింది. ఇదే తరహాలో ఇప్పుడు పీఆర్సీపై సంఘాలను బద్నాం చేసే ప్రక్రియ మొదలైందని ప్రచారం జరుగుతున్నది. అన్ని సంఘాలతో చర్చించాలనే ప్లాన్.. ప్రభుత్వం నుంచి వచ్చిన డైరెక్షన్లో భాగమేనంటున్నారు. ఇలాగైతే ఫిట్మెంట్ ప్రకటన చాలా ఆలస్యమవుతుంది. ఇందులో ఉద్యోగ సంఘాలపై ఒక ప్రణాళిక ప్రకారం వ్యతిరేక ప్రచారాలు మొదలుపెట్టనున్నారు. దీంతో సంఘాలు నిర్వీర్యంకానున్నాయి. అప్పుడు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అదే జరిగింది. ఇప్పుడు ఫిట్మెంట్ అంశంలో కూడా అదే జరుగుతుందనే చర్చ మొదలైంది.
ఒడువని ముచ్చటే
మరోవైపు వేతన సవరణ ఇప్పట్లో తేలేలా లేదు. సంఘాలన్నింటితోనూ చర్చలు పెట్టిన తర్వాత నివేదికను మళ్లీ సీఎంకు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఫిట్‌మెంట్‌పై మరోసారి సీఎం స్థాయిలో సమావేశమైన ప్రకటన చేసే విధంగా షెడ్యూల్ ఉంది. వాస్తవంగా గత నెలలోనే ఫిట్మెంట్ వస్తుందని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు సాగదీసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ లెక్కన వచ్చే వారంలో ఏదైనా ఎన్నికల నోటిఫికేషన్ వస్తే… ఇక పీఆర్సీ అంశం నెలల తరబడి వాయిదా వేయాల్సిందే. ఈసారి కూడా వరుస ఎన్నికలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ తర్వాత సాగర్ లేదా కార్పొరేషన్ల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. దీంతో పీఆర్సీ ఇక ఒడువని ముచ్చటే.