‘ధరణి’లో నమోదు కాకపోతే?
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. 1.01 కోట్ల కుటుంబాల వివరాలను సేకరించారు. నివేదికను మాత్రం అత్యంత గోప్యంగా ఉంచారు. కొత్త రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రణాళిక కోసమే ఈ సర్వే అని ప్రభుత్వం ప్రకటించింది. పొట్ట తిప్పలకు దూర ప్రాంతాలకు వెళ్లిన పేద కుటుంబాలు కూడా ఆగమాగంగా ఏ వాహనం దొరికితే అందులో పడి సొంత ఊర్లకు వచ్చాయి. మూడు రోజులపాటు పల్లెలన్నీ ఈ సర్వేలోనే నిమగ్నమయ్యాయి. సిబ్బందికి శిక్షణ […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. 1.01 కోట్ల కుటుంబాల వివరాలను సేకరించారు. నివేదికను మాత్రం అత్యంత గోప్యంగా ఉంచారు. కొత్త రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రణాళిక కోసమే ఈ సర్వే అని ప్రభుత్వం ప్రకటించింది. పొట్ట తిప్పలకు దూర ప్రాంతాలకు వెళ్లిన పేద కుటుంబాలు కూడా ఆగమాగంగా ఏ వాహనం దొరికితే అందులో పడి సొంత ఊర్లకు వచ్చాయి. మూడు రోజులపాటు పల్లెలన్నీ ఈ సర్వేలోనే నిమగ్నమయ్యాయి. సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. జనానికి అవగాహన కలిగించారు. అది ఏమైందో తెలియదు. మళ్లీ ఆస్తుల సర్వే పేరిట ఉద్యోగులను ఇంటింటికీ పంపిస్తున్నారు.
అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. నాటి సమగ్రత నేడు లోపించింది. కనీసం నమూనా ఫారాలు రూపొందించకుండానే సర్వే చేపడుతున్నారు. ఉద్యోగులకు శిక్షణ లేదు. జనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేవు. సర్వే వేగంగా చేయడం లేదంటూ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే ఎందుకు చేపడుతున్నారో, ఏయే ప్రయోజనాలు నెరవేరుతాయో ప్రచారం చేయలేదు. ఆస్తుల సర్వేకు చట్టబద్ధత ఉంటుందా? ఉండదా? అన్నదానికి బదులివ్వడం లేదు. ‘ధరణి’లో అప్లోడ్ చేసేందుకే అయితే ఆస్తికి సంబంధించిన వివరాలన్నీ వివిధ శాఖల దగ్గర ఉన్నాయి. వాటిని యథాతథంగా అప్లోడ్ చేస్తే సరిపోతుందని ఎన్జీఓలు సూచిస్తున్నాయి.
ఎందుకీ ఆరాటం?
గ్రామాలలోని ఇండ్ల లెక్కలు పంచాయతీరాజ్ శాఖ, పట్టణాలలోని లెక్కలు పురపాలక శాఖ వెబ్సైట్ లో ఉన్నాయి. అసెస్మెంట్ చేసిన ఆస్తులన్నింటికీ ప్రత్యేక నంబర్లు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించడం వల్ల వచ్చే వివరాలకు, ఇప్పటికే ఆన్లైన్ లో పొందుపర్చిన డేటాకు పెద్ద తేడా ఏమీ ఉండదు. అయినా, మళ్లీ వివరాల సేకరణ ఎవరి ప్రయోజనాల కోసమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్ని కుటుంబాలు కిరాయి ఇండ్లల్లోనే మగ్గుతున్నాయో కూడా లెక్క తేలింది. అసెస్మెంట్ ప్రకారం ఇండ్ల విస్తీర్ణం తేటతెల్లమవుతుంది. ఇప్పుడేమో ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే సిబ్బందిని పంపడం వల్ల చాలా చోట్ల అవమానాలకు గురవుతున్నారు. ఇప్పటికింకా 25 నుంచి 30 శాతం ఆస్తుల నమోదు కూడా పూర్తి కాలేదు. గ్రేటర్ హైదరాబాద్, శివారు మున్సిపాలిటీల్లో మందకొడిగా సాగుతోంది. పాతబస్తీలోనైతే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం.
లెక్క తేలినా సొంతిండ్లు ఏవి?
రాష్ట్రంలో 1,01,93,027 కుటుంబాలుండగా వారిలో 24,90,594 మందికే పక్కా ఇళ్లు ఉన్నట్లు (24%) సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. 24,58,341 కుటుంబాలు (24%) అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. 44%, అంటే 45,02,101 కుటుంబాలు ఒకే గది ఇంట్లో నివసిసున్నాయి. 3,24,312 కుటుంబాలవి ప్లాస్టిక్ పైకప్పున్న తాత్కాలిక నివాసాలే. పెంకులు లేదా రాతి పైకప్పు ఉన్న ఇళ్లలో 7,41,492 కుటుంబాలు నివసిస్తున్నాయి. సర్వే తర్వాత ఎంత మందికి సొంతింటి భాగ్యం కలిగిందో ప్రభుత్వమే చెప్పాలని కాంగ్రెస్, సీపీఎం డిమాండ్ చేస్తున్నాయి. ధరణిలో నమోదు చేయించుకోకపోతే భవిష్యత్తులో ఎలాంటి లావాదేవీలు జరుగవని ప్రచారం చేస్తున్నారు. నమోదు కాని ఆస్తులు ప్రభుత్వ ఆస్తులంటూ భయపెట్టిస్తున్నారని మండిపడుతున్నాయి.
ప్రజలకు ఇబ్బందులు..
సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఏ పథకమూ అమలు చేయలేదు. వివిధ శాఖల్లో ఉన్న ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్లో అప్లోడ్ చేసుకునే వీలుంది. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఆస్తుల సర్వే అంటూ ఉద్యోగులను తిప్పలు పెడుతున్నారు. జనం కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎస్కేఎస్ నివేదిక ఆధారంగా ఎంత మంది పేదలకు ఇండ్లు ఇచ్చారో, ఎంత మందికి రుణాలు ఇచ్చారో ప్రభుత్వం వెల్లడించాలి. చట్టబద్ధత లేని సర్వే రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. – ఎం.శ్రీనివాస్, కార్యదర్శి, గ్రేటర్ సీపీఎం
చట్టాలు రూపొందించకుండా.. ఆస్తుల నమోదు ఎందుకో చెప్పడం లేదు. ఎలాంటి చట్టం రూపొందించలేదు. ఇష్టమొచ్చినట్లుగా ప్రశ్నలు వేస్తున్నారు. ఆధార్ నంబరు అడగొద్దని సుప్రీం కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదు. వారసుల ఆధార్ నంబర్లు కూడా అడగడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? డేటా కలెక్షన్ చట్టబద్ధంగా ఉండాలి. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి పోయినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ డేటా ఎవరి చేతికైనా వెళ్తే ప్రైవసీ ఎలా ఉంటుంది? తప్పులు దొర్లితే ఎక్కడికి వెళ్లాలి? రెవెన్యూ కోర్టులు రద్దు చేశారు. వివాదాలను పరిష్కరించుకోవడానికి ఎక్కడికి వెళ్లాలి? – మల్లికార్జున్ రెడ్డి, ఫోర్స్ ఎన్జీఓ సభ్యుడు
ధరణికి చట్టబద్ధత ఉందా?
వ్యవసాయ భూములకు సంబంధించిన వివరాలకే ధరణి అన్నారు. ఇప్పుడేమో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను చేపట్టారు. ధరణి ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేస్తామంటున్నారు. మరి రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరించారా? ఏ చట్టం ప్రకారం ధరణికి చట్టబద్ధత లభించిందో ప్రజలకు చెప్పాలి. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఉంది. సంబంధిత శాఖల దగ్గర ఇండ్ల డేటా ఉంది. మళ్లీ సర్వే అవసరం ఏముంది? అప్పుడూ పేదలను ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు కూడా పనులన్నీ వదులుకొని నమోదు చేయించుకోవాల్సిన దుస్థితిని కల్పించారు. – తడక కల్పన, టీపీసీసీ కార్యదర్శి