పేదల గూళ్లపై..పెద్దల కన్ను.. ఆపేదెవరు?
దిశ, వేములవాడ: సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నంది ముఖద్వారం నుండి కొంత ముందుకు వెళ్ళగానే కుడివైపుగా కొన్ని పాడుబడిన గృహాలతో పాటు.. అందులోనే కొన్ని బహుళ అంతస్తులు కనబడతాయి. అసలు ఇవి ఎవరివి..? ఇక్కడ ఉన్న వారు ఎవరు..? శిథిలావస్థకు చేరుకుని గోడలన్నీ పడిపోయే స్థితిలో ఉన్న చిన్నపాటి కుటీరంలో ఉంటున్న కడు పేదలు ఎవరు..? ఆ పక్కనే బహుళ అంతస్తులు నిర్మిస్తున్న వారెవరు..? అనేవి వేములవాడ రాజన్న దర్శనానికి వెళుతున్న వారితోపాటు తిరిగి వస్తున్న వారికి, […]
దిశ, వేములవాడ: సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నంది ముఖద్వారం నుండి కొంత ముందుకు వెళ్ళగానే కుడివైపుగా కొన్ని పాడుబడిన గృహాలతో పాటు.. అందులోనే కొన్ని బహుళ అంతస్తులు కనబడతాయి. అసలు ఇవి ఎవరివి..? ఇక్కడ ఉన్న వారు ఎవరు..? శిథిలావస్థకు చేరుకుని గోడలన్నీ పడిపోయే స్థితిలో ఉన్న చిన్నపాటి కుటీరంలో ఉంటున్న కడు పేదలు ఎవరు..? ఆ పక్కనే బహుళ అంతస్తులు నిర్మిస్తున్న వారెవరు..? అనేవి వేములవాడ రాజన్న దర్శనానికి వెళుతున్న వారితోపాటు తిరిగి వస్తున్న వారికి, రాజన్న ధార్మిక క్షేత్రం లో నివాసం ఉంటున్న చాలా మంది మదిని తొలుస్తున్న సందేహాలు. వీటన్నింటిపై కొంతమేరకైనా అవగాహన రావాలంటే ఓసారి వేములవాడ లోని ‘శివపార్వతుల
ఇండ్లు’ అని పిలువబడే ఈ కాలనీ వైపు ఓ కన్ను వేయాల్సిందే.
శివుని నమ్ముకున్న వాళ్లు సేదతీరేందుకు..
అన్నింటికీ ఆ శివయ్య దిక్కు అని నమ్ముకున్నవారు సేదతీరేందుకు టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు.. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో శివపార్వతుల కాలనీ పేరిట చిన్న గృహాలను నిర్మించినట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది.
ఇక్కడ సుమారు 50 వరకు చిన్నపాటి ఇండ్లు నిర్మించగా, వీటిని భోలాశంకరుని నమ్ముకున్న శివపార్వతుల మాత్రమే అనుభవించేందుకు వీలుందని పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పేర్కొన్నారు. ఏళ్ళ క్రితం నిర్మించిన శివపార్వతుల ఇల్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఐదేళ్ల నుంచి పదేళ్ల కిందట ఈ గృహాలు చాలా వరకు ఖాళీ ఉండేవని, 15 కుటుంబాలు స్థానికంగా ఉన్నట్లు పలువురు పేర్కొన్నారు. వీరిలోనూ శివపార్వతుల అనేవారు లేరని ప్రచారం మెండుగా వినబడుతుంది.
అన్యాక్రాంతం.. అక్రమ నిర్మాణాలు..
శిధిలావస్థలో ఉన్న శివపార్వతుల కాలనీలోని గదులు అన్యాక్రాంతం అవుతున్నాయి. అసలు పట్టాదారులు ఎవరో తెలియకుండానే అక్రమార్కులు బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. శివుని నమ్ముకుని ఉన్న శివపార్వతుల సేదతీరేందుకు ఇచ్చిన భూములు ఎలా అమ్మకాలు జరుగుతున్నాయి అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇలాంటి స్థలంలో బహుళ అంతస్తుల నిర్మాణాలకు ఏ అధికార యంత్రాంగం అనుమతినిచ్చిందో తెలియడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు రాజన్న సన్నిధానానికి వచ్చి వెళ్లడం సర్వసాధారణం. ఇదే దారిలో ఉన్న శివపార్వతుల కాలనీలో నిర్మితమవుతున్న అక్రమ నిర్మాణాలపై ఎవరు ఆరా తీయలేదు. దీంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు అనేకం ఉన్నాయి. ఆక్రమణకు గురి అవుతున్న భూమి పై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ వుంది.
భూమికి ధరల రెక్కలు రావడంతో..
ఒకప్పుడు వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు అర కిలోమీటర్ మేర ఉన్న భూములకు మాత్రమే ధర అధికంగా ఉండేది. కానీ జిల్లాల పునర్విభజనలో భాగంగా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భవించడం, దీనికితోడు మిడ్ మానేరు కారణంగా అనేకమంది తమ భూములు కోల్పోయి వేములవాడ ను నిర్వాసిత ప్రాంతంగా ఎన్నుకోవడంతో వేములవాడ భూములకు ధరల రెక్కలు వచ్చాయి. దీనిలో భాగంగానే శివపార్వతుల కాలనీ పాత ఇళ్లకు గిరాకి పెరిగింది. వేములవాడ నందిగామ నుండి 100 మీటర్ల దూరంలో ప్రధాన రహదారికి అనుకుని గుంట ధర 30 లక్షలు పలుకుతుంది. ఇంతటి ధర పెట్టి పట్టా భూములను కొనుగోలు చేయడం ఎందుకని భావించిన కొందరు రియల్టర్లు శివపార్వతుల కాలనీ పై కన్నేశారు.
స్థానిక నేతలను మచ్చిక చేసుకుని శివపార్వతుల కాలనీలో ఏళ్ల క్రితం ఉన్న వారి వివరాలను ఆరా తీస్తూ వ్యాపారానికి తెరలేపారు. శివపార్వతుల వారసులు ఉన్నారని నమ్మ బతుకుతూ కాసుల బేరానికి దిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శిధిలావస్థలో ఉన్న శివ పార్వతి ఒక ఇల్లు అడుగు స్థలం కనీసంగా 8 లక్షల నుండి 15 లక్షల పెట్టి అక్రమ మార్గంలో కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. కాలనీలో ఏళ్ళ కాలంగా ఉంటున్న వారి బంధువులని, మరో వరుసను తెలుపుతూ నాయకులు తెరవెనుక ఉండి బహుళ అంతస్తుల నిర్మాణానికి అడుగులు వేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే అసలు హక్కుదారులు ఉంటే వారికి న్యాయం జరగడంతో పాటు అక్రమార్కుల చర్యలకు అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయాలు స్థానికంగా ఉన్నాయి. కోట్ల విలువైన ఈ భూములపై అధికారులు ఇలాంటి చర్యలకు వెళతారో వేచి చూడాలి మరి.