మీకు కరోనా వచ్చిపోయిందా..? కొత్త జబ్బులేమోస్తున్నాయి..?

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా కరోనతోపాటు ఏ జిల్లాలో ఏ వ్యాధులు అధికంగా ప్రబలుతున్నాయనే అంశాన్ని గుర్తించేందుకు ఆరోగ్యశాఖ సర్వే చేపట్టబోతున్నది. ఇంటింటికీ తిరిగి ప్రతి వ్యక్తి వివరాలను సేకరించనున్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డారా? ఎన్నిసార్లు వచ్చింది? పోస్టు కొవిడ్‌లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? ఎక్కువ మందిలో ఏం తేలుతున్నాయి? దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయా? ఎంత కాలం నుంచి మందులు వాడుతున్నారు? ప్రస్తుతం వాటి స్టేటస్ ఎలా ఉంది? వంటి తదితర […]

Update: 2021-08-14 19:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా కరోనతోపాటు ఏ జిల్లాలో ఏ వ్యాధులు అధికంగా ప్రబలుతున్నాయనే అంశాన్ని గుర్తించేందుకు ఆరోగ్యశాఖ సర్వే చేపట్టబోతున్నది. ఇంటింటికీ తిరిగి ప్రతి వ్యక్తి వివరాలను సేకరించనున్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డారా? ఎన్నిసార్లు వచ్చింది? పోస్టు కొవిడ్‌లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? ఎక్కువ మందిలో ఏం తేలుతున్నాయి? దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయా? ఎంత కాలం నుంచి మందులు వాడుతున్నారు? ప్రస్తుతం వాటి స్టేటస్ ఎలా ఉంది? వంటి తదితర అంశాలను ప్రజల నుంచి అడిగి తెలుసుకోనున్నారు. ఈ మేరకు 37 వేల మంది ఆశా వర్కర్లు, 8 వేల ఏఎన్ఎమ్ లను శిక్షణ ఇవ్వనున్నారు. వీరంతా స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సర్వే చేయాల్సి ఉంటుంది. ఈ నెలాఖరు నుంచి ఈ సర్వే చేసేందుకు ఆరోగ్యశాఖ కసరత్తులు చేస్తోంది. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఐహెచ్ఐపీ(ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫాం)లో పొందుపరిచేందుకు పంపియనున్నారు.

ఏ జిల్లాల్లో ఏ వ్యాధి అత్యధికంగా ఉంది..?

ఆరు నెలల కిందట రాష్ర్ట వైద్యారోగ్యశాఖ చేసిన సర్వే ప్రకారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిర్మల్, సంగారెడ్డి, సిద్ధిపేట్, వరంగల్ జిల్లాల్లో మలేరియా వ్యాధి అత్యధికంగా ఉండగా, గద్వాల, ఖమ్మం, కరీంనగర్, జిల్లాల్లో టైపాయిడ్ వ్యాధి ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ గుర్తించింది. అంతేగాక భూపాలపల్లి, జనగామ, కొత్తగూడెం, మెదక్, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, నిజామాబాద్, వరంగల్ రూరల్, వనపర్తి జిల్లాల్లో ప్లూ జ్వరాలు అత్యధికంగా ఉన్నాయి.

నాలుగేళ్లుగా సీజనల్ వ్యాధులు పరిస్థితి ఇలా..

2017లో రాష్ట్ర వ్యాప్తంగా 2,688 మలేరియా కేసులు తేలగా, 2018లో 1,792, 2019లో 1,709, 2020లో 872తో పాటు ఈ ఏడాది ఇప్పటి వరకు 240 కేసులు తేలినట్లు ఆరోగ్యశాఖ పొందుపరిచింది. అదే విధంగా 2017లో 3,827 డెంగీ కేసులు తేలగా, 2018లో 6,362, 2019లో 13,361, 2020లో 2,173, ఈ సారి 265 కేసులు రికార్డు అయ్యాయి. దీంతో పాటు 2017లో చికెన్ గున్యా వ్యాధి 58 మందికి, 2018లో 1,063, 2019లో 1,374, 2020లో 182 కేసులు తేలగా, ఈ సారి ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అంతేగాక జాపనీస్ ఏన్కెఫలైటిస్‌తో మరో 83 మంది బాధపడ్డట్లు అధికారులు ధ్రువీకరించారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే గడిచిన రెండేళ్లలో సీజనల్ వ్యాధులు బాగా తగ్గాయని ఆరోగ్యశాఖ కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది.

ప్రతి లక్షలో ఇలా….

రాష్ట్ర వ్యాప్తంగా 2017లో ప్రతి లక్షలో 902 మంది డయేరియా బారిన పడగా, 2018లో 911, 2019లో 527, 2020లో 750 మంది వ్యాధితో బాధపడ్డారు. అదే విధంగా 2017లో ప్రతి లక్షలో 106 మంది జ్వరాలతో బాధపడగా, 2018లో 105.7, 2019లో 44.4, 2020లో 26.8 మంది చికిత్స పొందారు. ఇక స్వైన్ ప్లూతో 2017లో ప్రతి లక్షలో 5.4, 2018లో 2.5, 2019లో 3.5, 2020లో 1.1 ట్రీట్మెంట్ పొందారు.

జ్వరం, ఇన్‌ప్లూజెంజా, స్వైన్‌ప్లూతో మరింత అప్రమత్తంగా ఉండాలి

ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో జ్వరం, ఇన్‌ప్లూజెంజా, స్వైన్ ప్లూ లక్షణాలతో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ చెబుతోంది. కరోనా, సీజనల్ సింప్టమ్స్ ఒకే విధంగా ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధులతో పాటు శీతాకాలంలో వ్యాప్తి చెందే స్వైన్ ప్లూ పట్ల కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. దగ్గు, జలుబు, తుమ్ములు లాంటి లక్షణాలున్నోళ్లంతా సకాలంలో కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆరోగ్యశాఖ వివరించింది.

ప్రతి లక్ష మందిలో సీజనల్ వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య

వ్యాధి 2017 2018 2019 2020
డయేరియా 902 911 527 750
ఫీవర్లు 106.7 105.7 44.4 26.8
స్వైన్‌ప్లూ 5.4 2.5 3.5 1.1
మలేరియా 6.7 4.5 4.3 2.2
డెంగీ 9.6 15.9 33.5 5.4

Tags:    

Similar News