ముందు జాగ్రత్తే లాభం చేకూర్చింది!
దిశ, కరీంనగర్: రాష్ట్రంలో గోళికంగా అతి చిన్నగా ఉన్న ఆ జిల్లాకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆ జిల్లా కేంద్రం నుండే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలంగాణలో వీఐపీ నియోజకవర్గాల్లో టాప్ లో ఉండే సిరిసిల్లా జిల్లా నుండే పెద్ద ఎత్తున ఉపాధి కోసం విదేశాలకు వెల్లి జీవించే వారి సంఖ్య కూడా ఎక్కువే. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ జిల్లాలోకి అడుగుపెట్టకుండా ఉండేందుకు […]
దిశ, కరీంనగర్: రాష్ట్రంలో గోళికంగా అతి చిన్నగా ఉన్న ఆ జిల్లాకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆ జిల్లా కేంద్రం నుండే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలంగాణలో వీఐపీ నియోజకవర్గాల్లో టాప్ లో ఉండే సిరిసిల్లా జిల్లా నుండే పెద్ద ఎత్తున ఉపాధి కోసం విదేశాలకు వెల్లి జీవించే వారి సంఖ్య కూడా ఎక్కువే. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ జిల్లాలోకి అడుగుపెట్టకుండా ఉండేందుకు కలెక్టర్ కృష్ణ భాస్కర్ తీసుకున్న ముందస్తు చర్యలు ఫలించాయి. అంతర్జాతీయ స్థాయిలో కరోనా ప్రబలుతున్న తీరుపై ఎప్పటిప్పుడు పరిశీలిస్తున్న ఆయన ముందస్తుగా తీసుకున్న జాగ్రత్తలే సిరిసిల్లాను ఇప్పటి వరకు కరోనాకు దూరంగా ఉంచాయి.
మానవ సంబంధాలను దూరం చేయడమే కరోనా వ్యాప్తి చెందకుండా అసలైన మార్గమని గుర్తించిన కలెక్టర్ .. ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ కంటే ముందే సిరిసిల్లా కలెక్టర్ అప్రమత్తం అయ్యారు. సిరిసిల్లా జిల్లాకు చుట్టుూ ఉన్న దారులను మూసేశారు. ప్రధానంగా కరీంనగర్ కు వచ్చిన ఇండోనేషియన్లకు పాజిటివ్ రావడంతో ఆయన జిల్లా నలుమూలాల నాకాబందీ చేశారు. జిల్లా వాసులు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే జిల్లాకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో 17వ తేదీ నుంచే సిరిసిల్ల జిల్లా స్వీయ నిర్భందంలోకి వెల్లిందని చెప్పాలి.
చిన్న జిల్లానే అయినా ఇక్కడి యంత్రాంగానికి పెద్ద సమస్య ఎన్ఆర్ఐలతోనే ఉందని చెప్పక తప్పదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వారు ఉన్నత చదువులు కోసం విదేశాలకు వెళ్లితే… సిరిసిల్లా ప్రాంత ప్రజలు పొట్ట చేతపట్టుకుని కార్మికులుగా వెళ్లారు. వేలల్లో ఉన్న వలస వెళ్లిన కార్మికుల సంఖ్యే జిల్లా అధికారులను కలవరపెట్టింది. అయినప్పటికీ వారందరినీ గుర్తించడంలో జిల్లా అధికార యంత్రంగం సఫలం అయింది. 1032 మంది ఇతర దేశాల నుండి సొంత ఊర్లకు వచ్చారు. వీరందరినీ కూడా జిల్లా యంత్రాంగం గుర్తించి స్టాంపింగ్ చేసి హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించింది.
కరోనా ప్రబలుతున్న ఈ కష్ట కాలంలో వెయ్యి మందికి పైగా విదేశాల నుండి వచ్చిన సంఖ్య విషయంలో రాష్ట్రంలోనే సిరిసిల్ల టాప్ లో ఉంటుందేమో. వారందరినీ గుర్తించడం జిల్లా అధికారులకు పెద్ద సవాల్ గా నిలిచింది. అలాగే జిల్లా నుండి మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య కూడా తక్కువగా ఉండడం వారిని, డైరక్ట్ కాంటాక్ట్ అయిన మొత్తం 11 మందిని ఐసొలేషన్ కు తరలించారు. దీంతో జిల్లాలో కరోనా ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లయ్యింది.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మూడు ఐసొలేషన్ కేంద్రాలను సిద్ధం చేయడంతోపాటు, పలు చోట్ల క్వారంటైన్ సెంటర్లను కూడా సిద్ధంగా ఉంచారు. అయితే ఇప్పటి వరకు ఒక్క క్వారంటైన్ సెంటర్ ను కూడా వినియోగించని రికార్డు కూడా సిరిసిల్లకే దక్కనుంది. విదేశాల నుండి వచ్చిన వంద శాతం మంది హోం క్వారంటైన్ కే పరిమితం కావడమే ఇందుకు కారణం.
ఆరోగ్య సూత్రాలు
జిల్లా వాసుల్లో రోగ నిరోధక శక్తి పెంచాలన్న లక్ష్యంతో వైద్యుల సూచనలతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంలో కూడా సిరిసిల్లా కలెక్టర్ సఫలం అయ్యారు. సి విటమిన్ ఎక్కువగా లభించే మోసంబిను ప్రత్యేకంగా నల్గొండ జిల్లా నుండి తెప్పించారు. జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రెండు టన్నులు బత్తాయిలను జిల్లా వాసులకు అందుబాటులో ఉంచారు. దీనివల్ల ఒక వేళ కరోనా బాధితులను కలిసి జిల్లా కు వచ్చిన వారు ఎవరైనా ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని భావించారు. అలాగే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో వారికి కరోనాపై అవగాహన కల్పించేందుకు పల్లె జనానికి అర్థమయ్యే రీతిలో ఒగ్గు కథ బాణిలో తక్కువ నిడివితో వీడియోలను తయారు చేయించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
రోడ్లపైకి వచ్చిన కలెక్టర్..
లాక్ డౌన్ తరువాత ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్న వారిని నియంత్రించేందుకు పోలీసుల కన్నా ముందే జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ రోడ్డపైకి వచ్చారు. లాక్ డౌన్ ను ధిక్కరిస్తున్న వారిని పట్టుకుని మరీ మందలించారు. వాహనాలను స్వాధీనం చేసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అంతేకాకుండా ఓ రాజకీయ నాయకుడు కూడా కలెక్టర్ కు తారసపడడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాజకీయ నాయకున్నని కలెక్టర్ కు సమాధానం చెప్పగానే మరింత సీరియన్ అయి ఆ నాయకునిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కఠినంగా వ్యవహరిస్తూ ప్రజలు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవడంలో కృష్ణ భాస్కర్ తన మార్కు చూపించారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, ఇలాగే మరిన్ని రోజులు అలర్ట్ గా ఉండాలని జిల్లా యంత్రాంగానికి సూచిస్తున్నారు.
కొంతకాలం కఠినంగా వ్యవహరించడం, నియంత్రణ చర్యల్లో తలామునకలై ఉంటే శాశ్వతంగా కరోనా మన దరికి రాకుండా ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పదే పదే ఆ కలెక్టర్ చెబుతున్నారు. మరిన్ని రోజులు కూడా ఇలాగే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ముందుకు సాగాలని కలెక్టర్ నిర్ణయించుకోవడం మంచిదేనని అనిపిస్తోంది. ఇప్పటి వరకు కరోనా సోకని అతి తక్కువ జిల్లాల సరసన నిలిచిన సిరిసిల్ల ఇక ముందు కూడా అలాంటి సక్సెస్ తోనే ముందుకు సాగాలని ఆశిద్దాం.
Tags: Sircilla Collector, Krishna Bhaskar, District Administration, Action, Corona, No Positive Cases