తాజా ఫలితాలతో.. కమలం వైపు కీలక నేతల చూపు!

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కేంద్రంలో - Will the results of the five state elections turn out in favor of the BJP?

Update: 2022-03-10 11:47 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కేంద్రంలో అధికారం.. రాష్ట్రంలో క్రమంగా బలపడుతున్న పార్టీ.. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. తెలంగాణలో బీజేపీని మరింత బలపడేందుకు అవకాశం మారుతోంది. గతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కీలక నేతలు కొందరు బీజేపీలో చేరగా.. తర్వాత వలసలు ఆగిపోయాయి. తాజాగా బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం వీయటంతో.. అసంతృప్తులు, టికెట్లు రావని భావించే నాయకులు కమలం పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు తమ అనుచరులు, అభిమానులతో చర్చించగా.. తాజాగా చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. తాజా ఫలితాలతో జిల్లా రాజకీయ సమీకరణాలు మారనున్నాయనే చర్చ సాగుతోంది..!

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావటంతో.. తెలంగాణ రాజకీయాల్లోనూ మార్పులకు దారి తీసేలా ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయనే చర్చ సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు బీజేపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, సిర్పూర్(టి) నుంచి పోటీ చేసి ఓడిపోయిన పాల్వాయి హరీష్ బాబు బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, పెంబి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన జడ్పీటీసీ సభ్యురాలు భుక్యా జానుబాయిలు కూడా కాషాయ కండువా వేసుకున్నారు. ఆ తర్వాత పెద్దగా వలసలు లేవు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు, పార్టీ, ప్రభుత్వ పదవులు రానివారు, వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో.. లేదోననే అనుమానం ఉన్న వారితో పాటు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్ పర్సన్లు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే గెలుస్తారా.. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా.. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందా.. బీజేపీలో చేరితో ఎలా ఉంటుందని తమ అనుచరులు, అభిమానుల వద్ద అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నారు. ఇప్పుడే తొందర ఎందుకని.. కొన్ని రోజులు వేచి చూద్దామనే భావనతో ఉండగా.. తాజా ఎన్నికల ఫలితాలతో ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. వారం, పది రోజుల్లో కొందరు కీలక నాయకులు బీజేపీలో చేరుతారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే వీరితో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా చర్చించినట్లు సమాచారం.

టీఆర్ఎస్ పార్టీలో మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, మాజీ జిల్లా అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు, మాజీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, సారంగాపూర్ జడ్పీటీసీ సభ్యుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు యు. ఫణిందర్ రావు, సీనియర్ నాయకులు ధని రాజేందర్ రెడ్డి తో పాటు ఉద్యమ కారులు పార్టీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్లకు అవకాశం రాకపోవటంతో.. మరింత అసంతృప్తికి కారణమైంది. వీరిలో చాలా మంది బీజేపీ వైపు చూస్తుండగా.. స్పష్టమైన హామీ వస్తే కమలం గూటికి చేరాలని భావిస్తున్నారు. ఓ ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ వస్తుందో లేదోననే అనుమానం ఉన్న మరికొందరు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొందరు కీలక నేతలు బీజేపీ వైపు చూస్తుండగా.. తమకు టికెట్ ఇస్తారనే.. హామీ వస్తేనే వెళ్లాలని భావిస్తున్నారు.

Tags:    

Similar News