మళ్లీ షురూ.. కందకాలు తవ్వినా.. నోటీసులిచ్చినా డోంట్ కేర్
మైనింగ్ నిర్వహణ అంతా అక్రమమని, నిబంధనలకు వ్యతిరేకంగా తోగ్గూడెం క్వారీలో పనులు జరుగుతున్నాయని ప్రజా సంఘాలు, స్థానికులు ఆరోపిస్తున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడంలేదు.
మైనింగ్ నిర్వహణ అంతా అక్రమమని, నిబంధనలకు వ్యతిరేకంగా తోగ్గూడెం క్వారీలో పనులు జరుగుతున్నాయని ప్రజా సంఘాలు, స్థానికులు ఆరోపిస్తున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడంలేదు. దిశలో వరుస కథనాల నేపథ్యంలో రాజకీయ నాయకులను ఆశ్రయించిన క్వారీ నిర్వాహకుడు.. వారిచ్చిన హామీతో మళ్లీ మైనింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం. అధికారులు సైతం తూతూమంత్రంగా కందకాలు తొవ్వించినా.. అర్థరాత్రి మళ్లీ కంకర తోలకాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. దిశపై అక్కసు పెంచుకున్న క్వారీ నిర్వాహకుడు సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలు పెట్టాడు. అయితే క్వారీ నిర్వాహకున్ని వెనుకేస్తూ అతనికి సలహాలు, సూచనలు ఇస్తున్నది మాత్రం ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకునిగా తెలుస్తుంది.
దిశ బ్యూరో, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం క్వారీల విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కించడం ఒకటైతే.. అక్రమార్కునికి పార్టీ నాయకులు కొమ్ము కాయడం విడ్డూరంగా ఉంది. ప్రజలకు రక్షణకు కల్పించి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండాల్సిన నాయకులు, అధికారులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ.. ప్రభుత్వాన్ని బురిడీ కొట్టిస్తూ, రాయల్టీ ఎగ్గొడుతూ కోట్లు ఆర్జిస్తున్న వ్యక్తులకు సహకరించడం విశేషం. ఇందులో తిలాపాపం.. తలాపిడికెడు అన్నట్లు ఎవరికి అందాల్సిన ముడుపులు వారికి అందుతుండటంతో అక్రమార్కునికి కొమ్ముకాస్తున్నారు. అతనిచ్చే ముడుపులకు ఆశపడి చర్యలు తీసుకున్నట్లు కట్టుకథలు అల్లుతున్నా.. ప్రజలను మభ్యపెడుతున్నా వాస్తవానికి అక్కడ జరుగుతున్న వ్యవహారం వేరని తెలుస్తుంది.
కందకాలు ఎందుకు తవ్వినట్లు..
దిశలో వచ్చిన కథనాలు అక్షర సత్యాలని ఆఫ్ ది రికార్డ్ గా చెప్పిన అధికారులు మూడు నాలుగు రోజుల తర్వాత లారీలు వెళ్లకుండా వచ్చి, పోయే మార్గాల వెంట కందకాలు తవ్వారు. స్వయంగా మైనింగ్ అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులు పాల్గొని క్వారీ నిర్వాహకునికి కూడా సమాచారం అందించారు. అంటే మైనింగ్ నిర్వహించకూడదు.. లారీల్లో కంకర తరలించకూడదనే అర్థం. అధికారులు సైతం చాలా తెలివిగా క్వారీల వద్ద మాత్రమే కందకాలు తొవ్వి.. క్రషర్ మిల్లుల వద్ద మాత్రం దారులు అలాగే ఉంచారు. దీంతో క్రషర్ మిల్లుల వద్ద కొట్టిన కంకరను అర్థరాత్రుల్లో తిరిగి రవాణా చేస్తున్నారు. అధికారులు క్వారీ వద్ద కందకాలు ఎందుకు తవ్వారో.. మైనింగ్ ప్రాంతంలో ఎందుకు వదిలారో వారికే తెలియాలి. క్రషర్ మిల్లుల వద్ద ఉన్న కంకరను తరలించండి.. క్వారీలో ఉన్న కంకరను మాత్రం రవాణా చేసుకోండి అన్నట్లు ఉంది అధికారుల వ్యవహారశైలి.
రాజకీయ నాయకుని అండదండా..
మైనింగ్ నిర్వాహకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఆ నాయకున్ని కలిసిన తర్వాతే నిర్వాహకుడు మళ్లీ యథేచ్ఛగా కంకర రవాణా చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు సదరు నాయకుడు అధికారులతో మాట్లాడి చూసిచూడనట్లు వ్యవహరించాలని చెప్పినట్లు టాక్. దీంతో తిరిగి ధైర్యం పుంజుకున్న క్వారీ నిర్వాహకుడు రెండు రోజులుగా అర్ధరాత్రులు రవాణా ప్రారంభించినట్లు స్థానికులు చెబుతున్నారు. తమ ప్రాణాలు, పశువుల ప్రాణాలు పోతున్నా.. బ్లాస్టింగ్స్ వల్ల ఆరోగ్యం చెడిపోతున్నా.. గాలి కలుషితం కారణంగా ఇబ్బందులు పడుతున్నా.. ఇళ్లు బీటలు వారుతున్నాయని నెత్తినోరు మొత్తుకున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్వారీ నిర్వాహకుడు అందజేసే ముడుపులకు ఆశపడి అధికారులు, నాయకులు ఇలాంటి అక్రమార్కులను ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమంగా మారుస్తామని హెచ్చరిస్తున్నారు.
పోలీసులపై నాయకుని ఒత్తిడి..
నియోజకవర్గం మొత్తం తన కనుసన్నల్లో నడిపిస్తున్న నాయకుడు సెటిల్ మెంట్ల విషయంలో కూడా అందెవేసిన చేయిగా ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గంలోని వివిధ స్టేషన్లకు వచ్చే సివిల్ కేసులు కూడా తనకు తెలియకుండా జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. స్టేషన్లకు వచ్చే సివిల్ కేసుల పరిష్కారం కోసం సదరు నాయకుడి దగ్గరకు తీసుకు వెళ్లడం.. ఆ నాయకుడే సెటిల్ చేయడం గమనార్హం. ఎవరైనా ఎదురుతిరిగి తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తే.. తిరిగి స్టేషన్ కు వెళ్లమని, అక్కడే చూసుకోండంటూ సెలవిస్తాడు. పోలీసులకు ముందే ఆదేశాలుండటంతో తీరా అక్కడికి వెళ్లినా న్యాయం దక్కకపోవడం.. చివరకు తిరిగి, వేసారి ఆ నాయకుడు చెప్పిందే వినడం గమనార్హం. పోలీసు అధికారులు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన వంతపాడడం పరిపాటిగా మారింది. చెప్పింది చేస్తే ఉద్యోగం చేసుకోవచ్చు.. లేదంటే బదిలీలు.. నోటీసులు.. సస్పెన్షన్లు ఎందుకని మిన్నకుంటున్నారు. ఓ పోలీసు అధికారికి చెందిన సివిల్ కేసు విషయంలో కూడా ఈ నాయకుడు ఇదే విధంగా వ్యవహరించడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోన మదనపడుతున్నాడు.
దిశపై క్వారీ నిర్వాహకుని అక్కసు..
దిశలో వరుస కథనాల నేపథ్యంలో తోగ్గూడెం క్వారీ పై వివిధ దినపత్రికల్లో, చానళ్లలో అనేక కథనాలు వచ్చాయి. దిశ లో వచ్చిన కథనాల ఆధారంగానే జిల్లాలో కాకుండా, రాష్ట్రస్థాయిలో తోగ్గూడెం క్వారీపై చర్చ సాగడంతో నిర్వాహకుడు దిశ దిన పత్రికను టార్గెట్ చేసుకున్నాడు. కథనాలు రావడమే ఆలస్యంగా స్థానిక నాయకుని దగ్గరకు పరుగులు పెట్టసాగాడు. అతని డైరెక్షన్ లో సోషల్ మీడియాలో దిశ విలేకరులపై దుష్ప్రచారం సాగించాడు. అడిగినన్ని డబ్బులు ఇవ్వలేదనే అక్కసుతో క్వారీ పై రాస్తున్నారని ఆరోపించాడు. అక్రమార్కుల మీద వార్తలు వస్తేమాత్రం డబ్బులు డిమాండ్ చేశారని చెప్పడం ఫ్యాషన్ గా మారింది. సదరు రాజకీయ నాయకుని అండతోనే ఈ వ్యవహారానికి తెరతీశాడని అర్థమవుతోంది. మరోవైపు దిశ కథనాల కారణంగానే అధికారులు కందకాలు తవ్వడం, మైనింగ్ నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేయడం.. మూడురోజుల్లోనే మళ్లీ రవాణా ప్రారంభిండం వెనుక ఉన్న అధికారులెవరు.. రాజకీయ నాయకులెవరన్న విషయం త్వరలోనే తేలనున్నది.
గతంలో దిశ విలేకరిపై.. తాజాగా గ్రామస్తుని పై
‘దిశ’ పత్రికలో కథనం వచ్చిన తొలిరోజే క్వారీ నిర్వాహకుడు స్థానిక విలేకరికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. సంవత్సరం మొత్తం రాసుకున్నా.. ఎవరూ ఏమీ పీకలేరని, ప్రతీనెల అధికారులకు మామూళ్ల పడేస్తున్నామని చెప్పుకొచ్చాడు. పనిలో పనిగా రాజకీయ నాయకులు కూడా ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశాడు. క్వారీలోకి అడుగుపెట్టాలంటే విలేకరులు బెదిరి చస్తారని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, లేదంటే క్వారీలో బొంద పెడతామని హెచ్చరించాడు. వార్తలు రాసే ఖమ్మం విలేకరికి కూడా చెప్పాలని లేదంటే వానికి కూడా మూడిందంటూ బెదిరించాడు. తాజాగా తోగ్గూడెం స్థానికుడు ఒకరు క్వారీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని క్వారీ నిర్వాహకుడుకు తీవ్ర బెదిరింపులకు గురిచేశాడు. ఇంటికి వెళ్లి యువకుని తండ్రిపై ఫైర్ అయ్యాడు. ‘నీ కొడుకు ఇట్లాగే చేస్తే లారీతో గుద్దించి చంపుతానని, నాకు రెండు నిమిషాల పని’ అని హూంకరించాడు. జరిగిన విషయాన్ని గ్రామస్తుడు ‘దిశ’కు తెలిపి నాకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తంచేశాడు. త్వరలోనే ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించాడు