ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు
ప్రజలు ఆదరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు.
దిశ, జూలూరుపాడు : ప్రజలు ఆదరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని గంగారం తండా, గాంధీనగర్ గ్రామాలలో రూ .7.50 లక్షల నిధులతో నిర్మిస్తున్న మూడు సీసీ రహదారులకు శంకుస్థాపన చేయటంతో పాటు గాంధీనగర్ గ్రామంలో రాందాస్ అనే రైతు నిర్మించిన పశువుల షెడ్డును ఆయన ప్రారంభించారు. సీసీ రహదారుల నిర్మాణాల శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలు ఏర్పాటు చేయకపోవడంపై పంచాయతీరాజ్ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలను ఒకవైపు అందిస్తూ, మరోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేశారని, డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మ దినం సందర్భంగా రూ.2 లక్షలలోపు రుణాలు మాఫీ కాని రైతులందరికీ మాఫీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీటిని ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చి ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. అనంతరం జూలూరుపాడులో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి, ఏపీఓ రవి, ఎంపీఓ తులసీరామ్, ఎంఈఓ జుంకీలాల్, పశువైద్యాధికారి బద్దులాల్, కాంగ్రెస్ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీ లాల్ నాయక్, మాజీ ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదనరావు, రాంబాబు, మోదుగు రామకృష్ణ, నరసింహారావు పాల్గొన్నారు.