ఆ విద్యార్థిని చదువు ఖర్చు అక్షరాల రూ. 12.84 లక్షలు..

అది ఓ ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..? ఆ ఖర్చు గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు.

Update: 2024-11-26 07:23 GMT

దిశ, వైరా : అది ఓ ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..? ఆ ఖర్చు గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ విద్యార్థి కోసం ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రభుత్వం ఒక లక్ష కాదు... రెండు లక్షలు కాదు.. ఏకంగా 12.84 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇది నిజమండి బాబు.. ఆ పాఠశాల ఎక్కడ ఉంది అంటారా..? ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి గ్రామంలో ఉంది. ఈ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుకునే సౌలభ్యం ఉంది. అయితే ఈ పాఠశాలలో ఇదే గ్రామానికి చెందిన ఒకే ఒక్క విద్యార్థిని కీర్తన 4వ తరగతి చదువుతుంది. ఈ ఒక్క విద్యార్థిని కోసం ప్రభుత్వం ఒక టీచర్ ను నియమించింది. ఆ టీచర్ కు నెలవారి జీతం రూ. 1,01,167 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ ఖర్చు 12 నెలలకు రూ. 12.14 లక్షలు అవుతుంది. అదేవిధంగా ఒక్క విద్యార్థినికి వంట వండేందుకు ప్రభుత్వం వంట మనిషికి నెలకు 3000 రూపాయలు చొప్పున చెల్లిస్తుంది.

అంటే 10 నెలలు 30 వేల రూపాయలన్న మాట. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికురాలికి నెలకు 3000 చొప్పున 10 నెలలకు 30 వేల రూపాయలు చెల్లిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం స్కూల్ మెయింటైన్ గ్రాండ్ కింద రూ.5000, స్పోర్ట్స్ గ్రాండ్ కింద మరో రూ. 5000 మంజూరు చేస్తుంది. అన్ని లెక్కలు కలిపి ఈ ఒక్క విద్యార్థిని పై ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం సుమారు 12.84 లక్షల రూపాయలను ఖర్చు చేస్తోంది. అయితే ఆ ఒక్క విద్యార్థిని పాఠశాలకు హాజరు కాకపోతే ఆ రోజు ఉపాధ్యాయురాలు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. అయితే ఈ వ్యవహారంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఒక్క విద్యార్థిని విద్య కోసం రూ. 12.84 లక్షలు ఖర్చు చేయటం ఏమిటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చైనాలో ఓ విద్యార్థిని కోసం అక్కడ ప్రభుత్వం రైలునే నడిపిందని, నారపనేనిపల్లి పాఠశాలలో ఒక విద్యార్థిని కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టటంలో తప్పు ఏమీ లేదంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Similar News