పెరుగుతోన్న భూ పంచాయితీలు.. అధికారుల తీరుతో సమస్య జఠిలం

భూ వివాదాలు రోజురోజుకూ జిల్లాలో పెరిగిపోతున్నాయి.

Update: 2024-11-27 02:00 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: భూ వివాదాలు రోజురోజుకూ జిల్లాలో పెరిగిపోతున్నాయి. పోలీసు స్టేషన్లలోనూ ఇటీవల ఇలాంటి కేసులు అధికమవుతున్నాయి. అవి హత్యలకు సైతం పురిగొల్పుతున్నాయి. భూములు, స్థలాల ధరలు పెరగడంతో కొంతమంది రెవెన్యూ రికార్డుల్లోని లోపాలను ఆసరా చేసుకుని అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారు. ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం, ఒకే స్థలాన్ని ఉద్దేశపూర్వకంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్న ఘటనలు పరిపాటయ్యాయి. వ్యవసాయ క్షేత్రాల్లో మొదలైన గొడవలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పరిష్కారం కావడం లేదు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా రైతుల మధ్య తలెత్తిన భూవివాదాలను తమ పరిధిలో పరిష్కారం చేసేందుకు చొరవ చూపడం లేదు. సరిహద్దు పంచాయతీ ఉన్నాయంటూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ అధికారులను సంప్రదించినా.. సమస్య పరిష్కారం వైపు కాకుండా రైతుల నుంచి వచ్చే కరెన్సీ ముడుపులపైనే ఫోకస్ పెడుతున్నారు తప్ప కొలతలు చేసి సరిహద్దులు చూపేందుకు ఆసక్తిని చూపడం లేదు. ఫలితంగా ఏళ్ల తరబడి భూముల సమస్య సమస్యగానే ఉంటోంది తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు.

ఆ భూముల్లోనే వివాదాలెక్కువ..

జిల్లా వ్యాప్తంగా భూమి లేని దారిద్ర్య రేఖకు దిగువన ఉండి భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం అసైన్‌మెంట్ భూములను మంజూరు చేసి పట్టాల పంపిణీ చేసింది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొలువుదీరిన ప్రభుత్వాల హయాంలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చిన భూములను చాలా మంది సాగు చేసుకుంటున్నారు.వివిధ కారణాలతో సాగు చేయని రైతులకు చెందిన భూములు, కొన్నేళ్లు సాగు చేసి మధ్యలో వ్యక్తగత కారణాల వల్ల సాగు చేయకుండా వదిలేసిన భూములను పక్కనున్న రైతులో, గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు కబ్జా చేసుకుని సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వారికి ముడుపులు ముట్టజెప్పి అక్రమంగా దొడ్డిదారిలో పట్టాలు చేయించుకున్న కొంతమంది రైతులు, ఒరిజినల్ పట్టాదారుల మధ్య జరుగుతున్న గొడవల కారణంగా జిల్లాలో గడిచిన 20 ఏళ్లలో దాదాపు 10 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. జిల్లాలో వివాదంలో ఉన్న భూముల కేసులు అనధికారిక లెక్కల ప్రకారం 10వేల నుంచి 12వేల వరకు చిన్నా పెద్దా కేసులు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో దాదాపు పదేళ్లకు పైగా పరిష్కారం కాకుండా కొట్టుకు చస్తున్న కేసులే సగానికి పైగా ఉన్నట్లుగా సమాచారం.

నకిలీ పట్టాల జారీ..

గ్రామీణ ప్రాంతాల్లోని అసైన్‌మెంట్ భూముల్లో కొన్ని సర్వే నెంబర్లలో వందల కొద్దీ ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ అసైన్మెంట్ భూములు ఉన్నాయి. వాటిలో చాలామందికి ప్రభుత్వాలు అప్పట్లోనే పట్టాలు జారీ చేశాయి. అధికారులు ఈ సర్వే నెంబర్లను ప్రత్యేకంగా ఎంచుకుని నకిలీ పట్టాలు తయారు చేసి రైతులకు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు అధికారులను మేనేజ్ చేసుకుని భూములు లేకపోయిన నకిలీ పట్టాలు పొందారు. బ్యాంకులో పంట రుణాలు పొందడాని కోసమే ఈ నకిలీ పట్టాలను ప్రత్యేకంగా చేయించుకున్నారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులకు భారీగా ముట్టజెప్పి పట్టాలు పొందిన దాఖలాలు ఉన్నాయి.

రుణాలు పొందిన వారిపై కేసులు

భూములు లేకపోయినా బ్యాంకు రుణాల కోసం పొందిన పట్టాలతో రుణాలు పొందిన రైతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతు రుణమాఫీ వర్తించింది. దీంతో అప్పుడు ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదులో భీమగల్ మండలంలోని దాదాపు 15 మంది గిరిజన రైతులతో పాటు బాన్సువాడ డివిజన్‌లో దాదాపు 20 మంది రైతులపై పోలీసు కేసులు కూడా నమోదు అయ్యాయి. రైతులకు వర్తించిన రుణ మాఫీని రద్దుచేయడమే కాకుండా, నకిలీ పట్టాలతో రుణాలు పొందిన రైతులను జైలుకు కూడా పంపారు. బోధన్ డివిజన్‌లో కూడా పలువురిపై కేసులు నమోదు అయ్యాయి. అప్పట్లో ఈ కేసులకు భయపడి చాలామంది రైతులు అధికారులతో కుమ్మక్కై కేసులు కాకుండా మాఫీ చేయించుకున్నారు. మరికొంతమంది రాజకీయ నాయకుల అండతో నకిలీ పట్టాలను భూములు లేకపోయినా పహానీ, 1బీ, ఖాస్రా పహానీల్లో వివరాలు నమోదు చేయించుకుని దర్జాగా ఇప్పటికీ పంట రుణాలు పొందుతున్నారు. ప్రభుత్వం ద్వారా పంట రుణమాఫీ‌ని కూడా పొందుతున్నారు.

సమస్యను పరిష్కరించలేకపోతున్న అధికారులు.. 

సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా భీమగల్ మండల పరిధిలోని కుప్కల్ గ్రామంలో ఉన్న సర్వే నెం.59‌లో ఉన్న 23 ఎకరాల భూమి వివాదాన్ని కూడా సర్వే అధికారులు పరిష్కరించలేకపోతున్నారు. దాదాపు ఈ సమస్య దాదాపు 15 ఏళ్లకుపైగా సాగదీస్తున్నారే తప్ప హద్దులు నిర్ణయించి పరిష్కరించడం లేదు. ఫలితంగా రైతులు పలుమార్లు భౌతికదాడులకు దిగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులు సర్వే కోసం టిప్పన్ కట్టిన ప్రతిసారీ దాదాపు రూ.20 వేలకు పైగా ముడుపులు తీసుకుని రైతులకు నోటీసులు ఇవ్వడం మొక్కుబడిగా వచ్చి ఏవేవో కారణాలు చెప్పి తిరిగి వెళ్లిపోవడం చేస్తున్నారే తప్ప భూమిని కొలిచి హద్దులు చూపడం లేదని రైతులు వాపోతున్నారు. 23 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న భూ సమస్యనే పరిష్కరించ లేని అధికారులు వందల కొద్దీ విస్తీర్ణంలో ఉన్న భూముల్లో హద్దుల సమస్యను ఎలా పరిష్కరిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.


Similar News