ఈ నెల 30న అట్టహాసంగా రైతు పండుగ : సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వం పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ జరిపి రైతులకు మద్దతు

Update: 2024-11-26 15:08 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ జరిపి రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించిన సందర్భంగా రాష్ట్రంలో అన్నదాతలు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో రైతులతో కలిసి సంతోషకర వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ సంబురాలు జరుపుకునేలా ఈ నెల 30 వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో 'రైతు పండుగ'ను అట్టహాసంగా నిర్వహించనున్నామని వెల్లడించారు. మంగళవారం సాయంత్రం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ తదితరులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి తో కలిసి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ లతో ధాన్యం సేకరణ, రైతులకు బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై సమీక్ష జరిపారు.

కొనుగోలు కేంద్రాల ద్వారా ఆయా జిల్లాల వారీగా సేకరించిన ధాన్యం, రైతులకు జరిపిన చెల్లింపుల గురించి ప్రస్తావిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. గతేడాది ఖరీఫ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 5634 కొనుగోలు కేంద్రాల ద్వారా 21 .94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఈసారి 8012 కేంద్రాలను నెలకొల్పి ఇప్పటికే 24 .49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేశామని వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి గత ఏడాది రైతులకు 2414 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగగా, ఈసారి ఇప్పటికే 3693 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేశామన్నారు. సన్నాలకు బోనస్ అందిస్తుండటం పట్ల రైతుల్లో తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

ఈ నెల 30న విస్తృత స్థాయిలో నిర్వహించనున్న రైతు పండుగ కార్యక్రమానికి ముందే సాధ్యమైనంత వరకు ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేయడంతో పాటు రైతుల ఖాతాలలో బోనస్ సహా బిల్లుల చెల్లింపులు అన్నీ పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్లకు సూచించారు. జిల్లా ఇంచార్జ్ మంత్రులతో పాటు, ఆయా ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారులు కూడా అనునిత్యం ధాన్యం సేకరణ, బిల్లుల చెల్లింపుల తీరును సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని నివేదించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే పరిష్కరించాలన్నారు. బిల్లుల చెల్లింపులకు అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నందున ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే టాబ్ ఎంట్రీలు పూర్తి చేసేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో పకడ్బందీ పర్యవేక్షణ కోసం ప్రతి కేంద్రానికి ఒకరు చొప్పున అధికారులను ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు. సన్నలకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తున్నందున ఏ దశలోనూ దొడ్డు ధాన్యం, సన్న ధాన్యంతో కలిసిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఎక్కడ కూడా రైతులు మోసాల బారిన పడి నష్టపోకుండా గట్టి పర్యవేక్షణ చేయాలని, ఎవరైనా రైస్ మిల్లర్లు దుర్వినియోగానికి పాల్పడితే, అలాంటివారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. డిఫాల్ట్ మిల్లర్లపై కూడా చట్టప్రకారం చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, పాఠశాలలతో పాటు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి కూడా వచ్చే జనవరి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించినందున సన్న ధాన్యం సేకరణ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. సన్న బియ్యం పంపిణీ కోసం సుమారు 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం అవసరం అవుతుందని, ఈ మేరకు పూర్తి స్థాయిలో సేకరణకు కృషి చేయాలని, పంపిణీ కోసం సన్న బియ్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం వెంటవెంట తూకం చేస్తూ రైస్ మిల్లులకు రవాణా చేయాలని, సరిపడా గన్నీ బ్యాగులు, ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.

ఈ నెల 30 న మహబూబ్ నగర్ లో నిర్వహించనున్న రైతు పండుగ కార్యక్రమం గురించి అన్ని జిల్లాలలో రైతులు, ప్రజలందరికి తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు వేడుకలలో రైతు పండుగ కార్యక్రమం ప్రసారం ఉంటుందన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీ.ఎస్.చౌహాన్ ధాన్యం కొనుగోళ్ల ప్రగతిని నివేదించగా, వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయ గౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డీ.ఎం రాజేశ్వర్, డీసీవో శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిణి గంగూబాయి, మెప్మా పీడీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News