ఆ వాచ్ మెన్ ఆత్మహత్య.. ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ వేధింపులే కారణమా..?
దిశ, లింగాల: నాగర్ కర్నూలు జిల్లా లింగాల - Watchmen commit suicide at Nagar Kurnool District Social Welfare Boys' School
దిశ, లింగాల: నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో సోమవారం వాచ్ మెన్ వెంకటేష్(34) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర భావికి చెందిన వెంకటేష్.. లింగాల గురుకుల పాఠశాలలో 13 ఏళ్లుగా ఔట్ సోర్సింగ్‌లో వాచ్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
కాగా గత ఏడాది క్రితం పాఠశాలకు వచ్చిన సూపరింటెండెంట్ సింగయ్య కొంత కాలం నుండి ఉద్యోగపరంగా వెంకటేష్‌ను వేధింపులకు గురి చేస్తున్నట్లు మృతుని బంధువులు ఆరోపించారు. సోమవారం ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ కలిసి మృతునికి సరెండర్ నోటీస్ తయారు చేసి సంతకం పెట్టమని వెంకటేష్‌పై ఒత్తిడి తేవడంతో తీవ్ర మనస్థాపానికి గురై తాను నివాసం ఉంటున్న పాఠశాలలోని భవనంలో వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా మృతుని భార్య ఉగాది పండుగకు వెంకటేశ్వర భావికి వెళ్లగా.. ఉద్యోగరీత్యా మృతుడు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు.
గురుకుల పాఠశాల ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత..
గురుకుల పాఠశాలలో వాచ్ మెన్ వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్న వార్త తెలుసుకున్న వెంకటేశ్వర భావికి చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో లింగాలకు తరలివచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం తో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోపోద్రిక్తులైన మృతుడి బంధువులు, గ్రామస్తులు సూపరింటెండెంట్ కోసం పాఠశాల గదులను వెతుకుతూ.. ఫర్నిచర్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్న జీపును అడ్డుకొని బంధువులు అడ్డంగా పడుకున్నారు.
సూపరింటెండెంట్ ఘటనా స్థలానికి రావాలని డిమాండ్ చేస్తూ.. ప్రిన్సిపాల్ వినోద్ ఖన్నాను ముట్టడించారు. మృతుడి భార్య, తల్లి ఇద్దరు తమకు న్యాయం చేయాలని రోదిస్తూ పాఠశాల భవనంపైకి ఎక్కి కిందికి దూకే ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. పాఠశాలలో పరిస్థితులు జటిలం అవుతూ ఉండడంతో సీఐ అనుదీప్ తో పాటు లింగాల బల్మూర్ ఎస్ఐలు రవి, సదానందం తో పాటు అచ్చంపేట ఇద్దరు ఎస్ఐలు, పోలీసులు భారీ సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలంలో మోహరించి పరిస్థితులను అదుపు చేశారు.
బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల రాస్తారోకో.. నిలిచిపోయిన వాహనాలు..
లింగాల గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న వాచ్ మెన్ వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జ్ నాగార్జున, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని మృతికి కారకులైన ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడినే నిలిచిపోయాయి.
మృతుని కుటుంబానికి న్యాయం చేస్తాం..
గురుకుల పాఠశాలలకు చెందిన వాచ్ మెన్ వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఆర్సీవో వనజ హుటాహుటిన పాఠశాలకు చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. సెల్ ఫోన్ ద్వారా గురుకుల కార్యదర్శి రోనాల్డ్ రాస్ తో మాట్లాడి పరిస్థితిని వివరించారు. కార్యదర్శికి నివేదిక సమర్పించడం జరుగుతుందని ఆదేశాల మేరకు మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై మృతుని భార్య జోష్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ పర్యవేక్షణలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు సంతానం ఉన్నారు.