100 శాతం భర్తీ చేయాలి.. లేదంటే ధర్నానే: ఆర్. కృష్ణయ్య స్ట్రాంగ్ వార్నింగ్
ప్రభుత్వానికి ఆర్. కృష్ణయ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు...
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సు పూర్తి చేసిన 5 లక్షల మంది బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని తెలంగాణ బీఈడీ సంఘం అభ్యర్థులు డిమాండ్ చేశారు. మంగళవారం నిర్వహించిన మహా ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ, ఆర్. కృష్ణయ్య పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఈడీ సంఘం అభ్యర్థులతో కలిసి కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కోటా తొలగించి 100 శాతం ఉద్యో గాలు బీఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖలో కేవలం స్కూల్ అసిస్టెంట్‌కి మాత్రమే అర్హులని, 5 లక్షల మందికి అరకొర పోస్టులు ప్రకటించడంతో ఎంతో మంది నష్టపోతున్నారన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం డీఎడ్ చేసిన వారికి 100 శాతం డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా ఎస్జీటీ రాసే అవకాశం ఇస్తున్నారన్నారు. బీఎడ్ చేసిన వారికి 100 శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రత్యక్షంగా రిక్రూట్ మెంట్ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని ఆర్ కృష్ణయ్య కోరారు.
ఎస్జీటీ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఇస్తున్న 70 శాతం పదోన్నతుల కోటాను తొలగిస్తూ 5 లక్షల మంది బీఈడీ అభ్యర్థులను కాపాడాలన్నారు. గతంలో ఎన్ సీటీఈ గెజిట్ ఆధారంగా అభ్యర్థులు బీఈడీ చేశారని, ప్రస్తుత పరిస్థితిలో కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కు మాత్రమే అవకాశం ఉండటంతో సరైన పద్ధతిలో నియామకాలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఫిబ్రవరి, మార్చిలో ఇచ్చే డీఎస్సీ నోటిఫికేషన్ లో ఎస్జీటీ టీచర్లకు ఇస్తున్న 70% ప్రమోషన్ కోటా ను తగ్గించి బీఈడీ చేసిన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీఈడీ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఈడీ చేసిన అభ్యర్థులకు 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులు భర్తీ చేయడం దేశంలో ఎక్కడా లేదన్నారు. డీఈడీ చేసినవారితో 100% ఎస్జీటీ పోస్టులు భర్తీ చేస్తూ మళ్లీ వారికి 70% స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ఇవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బీఈడీ చేసిన అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి బీఈడీ పూర్తి చేస్తే తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అధికారులు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించకుంటే మరోసారి పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునివ్వడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థలను పూర్తిగా స్తంభింపజేస్తామని బీఈడీ సంఘం అభ్యర్థులు హెచ్చరించారు.