వసతి గృహాల్లో సమస్యలు.. నాయకుల పిల్లలను ఉంచుతారా.?: బీసీ కమిషన్ ఆగ్రహం

వసతి గృహాల్లో సమస్యలపై బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు..

Update: 2024-11-26 17:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వసతి గృహాలలో నాయకుల పిల్లలను ఉంచుతారా..? అని, వసతి గృహాలలో చదువుకునే పిల్లలపై ఎందుకంత చిన్న చూపు అంటూ ప్రభుత్వాన్ని, నాయకులను, బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో బీసీ కమిషన్ బహిరంగా విచారణను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి 10 జిల్లాలోతో పాటు హైదరాబాద్‌లోనూ బహిరంగ విచారణ ముగిసిందని, రాష్ట్ర వ్యాప్తంగా 1336 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సమగ్ర సర్వే 21 జిల్లాలో పూర్తయిందని, 10 జిల్లాల్లో 90శాతానికి చేరుకుందని, మేడ్చల్ లో 82శాతం, జీహెచ్ఎంసీలో 76 శాతం జరిగిందన్నారు. హైద్రాబాద్ లో అదనంగా ఎన్యూమరేటర్లను నియమించారని వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర కులగణన సర్వేపై కొన్ని పార్టీలు, కొందరు నాయకులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇది సరికాదన్నారు. నిన్న రాజకీయ కోణంలో సర్వే పై కొందరు మాట్లాడారు, బీసీలకు సరైన ప్రాతినిధ్యం లభించాలని, వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులో కొన్ని కులాలను సాంప్రదాయ పనులలో తమను గుర్తించాలని కోరారు.

బీసీ జాబితాలో ఉండి ఓబీసీ జాబితాలో లేని 40 కులాలలో మైనార్టీ కులాలను మినహాయించి మిగిలిన కులాలను ఓబీసీల్లో కలపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. ఓబీసీ జాబితాలో వీరు లేనందున వారికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో నష్టపోతున్నారని పేర్కొన్నారు. వికారాబాద్, హైద్రాబాద్ ప్రాంతాల్లో ఉన్న తోలు బొమ్మలలాట కులాల వారికి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని తమకు వినతులు వచ్చాయని, వారిని వెంటనే గుర్తించి ధ్రువీకరణ పత్రాలను అందించే విధంగా కలెక్టర్లు, తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మత్స్యకారులు చేపలు విక్రయాన్ని గ్రామాల్లో పెద్దలు చెప్పిన రేటుకు విక్రయించకపోతే గ్రామ బహిష్కరణ చేస్తామని బెదిరిస్తున్నారని వినతులు వచ్చాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. గంగపుత్ర సంఘం, బెస్తవారు తమ కులాలు కాకున్న కొందరు తాము మత్స్యకారులమంటూ తమ జీవనోపాధిని లాగేసుకుంటున్నారని, గ్రామాల్లో చెరువుల్లో 50శాతం మాకు కేటాయించిన తర్వాతే వేరే వాళ్లకు కేటాయించాలన్నారు.

భవశార క్షత్రియ బీసీ డి నుంచి బీసీ బీలోకి మార్చాలని కోరారని తెలిపారు. అమన్ గల్ బాలుర వసతి గృహాం శిథిలావస్థకు చేరుకుందని ఇలాంటి పాఠశాలలో ఎవరైనా చదువుకుంటారా అని కమిషన్ చైర్మన్ నిరంజన్ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ లోని బాలికల వసతి గృహాన్ని సందర్శించినప్పుడు 200 మంది ఉండాల్సిన దాంట్లో 300 మంది ఉంటున్నారని, అలాంటప్పుడు వారు ఎలా నాణ్యమైన విద్యను అభ్యసించగలరని, అధికారులు, నాయకుల పిల్లలను అందులో చదివిస్తారా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రతిరోజు వార్తా పత్రికల్లో ఏదో ఒక చోట కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు పోతున్నాయని, వార్తలు వస్తున్నా అధికారులు,ప్రభుత్వం మొద్దు నిద్రను వీడటం లేదన్నారు. ఈ పరిస్థితికి పాలకులే కారణమని, ఇప్పటికైనా ఘటన జరిగినప్పుడు కాకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని బాలిక మరణించడం అత్యంత విషాదకరమని, అధికారులు ఇప్పుడైనా ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టచర్యలు చేపట్టాలని సూచించారు.బీసీ గణను అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఎంతటి వారైనా వారి హద్దుల్లో ఉండి మాట్లాడాలని లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సేకరించిన సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తున్నామని, ఎలాంటి అపోహలు వద్దని, ప్రజలు సర్వే అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్ , బాలలక్ష్మీ రంగు, డిప్యూటీ డైరెక్టర్ యు. శ్రీనివాస రావు, స్పెషల్ ఆఫీసర్ జి సతీష్ కుమార్ పాల్గొన్నారు.

బీసీ కమిషన్ చైర్మన్‌తో వాగ్వాదాం

ఎంబీసీ 36 కులాల సంఘం అధ్యక్షుడు ఎన్.నరహరి బీసీ కమిషన్ చైర్మన్ తో వాగ్వాదానికి దిగారు. కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, తమను దరఖాస్తులను అందజేయడానికి వస్తే బయటకు వెళ్లిపోమన్నారని, మేం పేద కులాల తరపున పోరాడుతున్నామని, మముల్ని ఎందుకు ఉండొద్దు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ న్యాయం చేయాల్సిన వారే మమ్ముల్ని వెళ్లిపోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చైర్మన్ మాట్లాడుతూ.. వారు గతంలో వచ్చి దరఖాస్తులు ఇచ్చారని దూరం నుంచి వచ్చిన సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తూ బహిరంగ విచారణకు ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు.


Similar News