అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర: పీసీసీ చీఫ్
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర పన్నుతుందని పీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర పన్నుతుందని పీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో టీపీసీసీ ఇంటలెక్చువల్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం జరిగింది. చైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..దేశం లో రాజ్యాంగం అమలుకు అడ్డంకులు ఏర్పడటం బాధాకరమన్నారు. గడిచిన పదేళ్లుగా బీజేపీ కుట్రలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ మార్చాలని చేస్తున్న ప్రయత్నంలో బీఆర్ఎస్ సహకరిస్తూ వస్తుందన్నారు.
అందుకే తెలంగాణలో ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. బీజేపీ ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా కాల రాసిందన్నారు. కానీ దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ అదరకుండా, బెదరకుండా రాజ్యాంగాన్ని కాపాడటానికి ముందుకొచ్చాడన్నారు. పాఠ్యపుస్తకాల్లోనూ రాజ్యాంగం పై సంపూర్ణమైన అవగాహన వచ్చేందుకు 8వ తరగతి నుంచే పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరతానన్నారు. రాజ్యాంగంలో సమాన హక్కులు అనేది అత్యంత కీలకమైన అంశంగా పేర్కొన్నారు. రాజ్యాంగ మూల సూత్రాలను తుంగలో తొక్కి స్వంత విధానాలతో బీజేపీ పాలించాలని చూస్తుందన్నారు. ఇక దేశంలోనే మొదటి సారిగా తెలంగాణలోనే కులగణన చేస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మేధావుల సూచనలు, సలహాల ద్వారా కులగణన ప్రాసెస్ ముందుకు సాగుతుందన్నారు. ఈ సమావేశంలో ప్రోఫెసర్ తిరుమల్, స్పోక్స్ పర్సన్ డాక్టర్ లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.