దిశ ప్రతినిధి మహబూబ్ నగర్/ సీసీ కుంట: మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామం ఒక చెట్టు వాగులో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి విగ్రహం బయటపడింది. ఒక చెట్టు వాగు వద్ద చెక్ డ్యాం నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుండగా మూడున్నర అడుగుల ఎత్తు ఉన్న శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి విగ్రహం ఆదివారం సాయంత్రం బయటపడింది.
ఈ విషయాన్ని స్థానికులు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కి సమాచారం అందజేశారు. సోమవారం ఉదయం జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, తదితర నేతలు అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఒక చెట్టు వాగు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు పరిశోధకులు, పురావస్తు శాఖ అధికారులు అక్కడికి చేరుకుని విగ్రహానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
ఈ విగ్రహం పదకొండవ శతాబ్దానికి చెందిన గా భావిస్తున్నారు. అన్యమతస్తులు హిందూ దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసం చేసే క్రమంలో కొంతమంది భక్తులు ఈ విగ్రహాన్ని తీసుకు వచ్చి ధ్వంసం కాకుండా వాగుల్లో దాచిపెట్టి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రావలసి ఉంది.