డీసీఏ కృషితోనే రెవెన్యూ శాఖ‌లో పోస్టుల అప్ గ్రేడ్

రెవెన్యూ శాఖ‌లో ద‌శాబ్ధాలుగా ప‌లు స్థాయిల‌లో పెండింగ్‌లో ఉన్న పోస్టుల అప్‌ గ్రేడ్‌ ప్రజా ప్రభుత్వంలో ఆమోదం ల‌భిస్తుంద‌ని డిప్యూటీ క‌లెక్టర్స్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్యక్షుడు వి.ల‌చ్చిరెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-11-26 14:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ శాఖ‌లో ద‌శాబ్ధాలుగా ప‌లు స్థాయిల‌లో పెండింగ్‌లో ఉన్న పోస్టుల అప్‌ గ్రేడ్‌ ప్రజా ప్రభుత్వంలో ఆమోదం ల‌భిస్తుంద‌ని డిప్యూటీ క‌లెక్టర్స్ అసోసియేష‌న్ (Deputy Collectors Association) రాష్ట్ర అధ్యక్షుడు వి.ల‌చ్చిరెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ క‌లెక్టర్స్ అసోసియేష‌న్(DCA) కృషి ఫ‌లితంగానే స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్టర్ నుంచి 33 సెల‌క్షన్‌ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్టర్ పోస్టుల అప్‌గ్రేడ్ అయిన‌ట్టుగా చెప్పారు. డిప్యూటీ క‌లెక్టర్స్ అసోసియేష‌న్ విన్నపాల మేర‌కు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సానుకూలంగా స్పందించి 33 ఎస్‌జీడీసీ(SGDC) నుంచి సెల‌క్షన్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్టర్‌ పోస్టుల అప్‌గ్రేడ్‌కు సంబంధించిన‌ ఫైల్‌పై సంత‌కం చేసి ఆమోదించార‌న్నారు. ద‌శాబ్ధాలుగా నోచుకోని పోస్టుల అప్‌గ్రేడ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి చొర‌వ‌తో ఆమోదం తెలిపినందుకు ప్రత్యేక ధ‌న్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో చిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవ‌స్థను ఈ ప్రభుత్వం బ‌లోపేతం చేస్తుంద‌న్నారు. అందులో భాగంగానే పోస్టుల‌ను అప్‌ గ్రేడ్ చేశారన్నారు. వీటికి సంబంధించిన మిగ‌తా ప్రక్రియ‌ను సైతం ప్రభుత్వం వెంట‌నే చేప‌ట్టి స‌ర్వీసు రూల్స్‌ను రూపొందించి ప‌దోన్నతుల వేగ‌వంతం చేయాల‌ని కోరారు. పోస్టుల అప్‌గ్రేడ్‌తో రాష్ట్రంలోని స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్టర్లకు సెల‌క్షన్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్టర్లుగా ప‌దోన్నతి ల‌భిస్తుందన్నారు. ఇదే కాకుండా పోస్టుల‌ అప్‌ గ్రేడ్‌తో అద‌న‌పు డైరెక్టర్ గ్రేడ్‌లో నేరుగా జిల్లా స్థాయిలో అద‌న‌పు క‌లెక్టర్లుగా ప‌ని చేసే అవ‌కాశం ఏర్పడింద‌న్నారు. పెరిగిన జిల్లాల‌కు అనుగుణంగా ఉద్యోగుల‌పై భారం త‌గ్గించేందుకు ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు కూడా కృషి చేస్తున్నట్టుగా చెప్పారు.

ఇదే కాకుండా అన్ని స్థాయిల‌లో క్యాడ‌ర్ స్ట్రెంథ్ పెంచేందుకు ప్రయ‌త్నం చేస్తున్నట్టుగా తెలిపారు. అన్ని క్యాడ‌ర్‌ల‌లో ప‌దోన్నతుల‌ను క‌ల్పించేందుకు కూడా కృషి చేస్తున్నామ‌న్నారు. త‌హ‌శీల్దార్లకు డిప్యూటీ క‌లెక్టర్లుగా ప‌దోన్నతుల‌ను ఇప్పించిన ఘ‌న‌త తెలంగాణ డిప్యూటీ క‌లెక్టర్స్ అసోసియేష‌న్‌కే ద‌క్కుతుంద‌న్నారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. లచ్చిరెడ్డి తో పాటు డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ, తహశీల్దార్ సంఘం నాయకులు పూల్ సింగ్, తదితరులు ఉన్నారు.


Similar News