రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి

Update: 2024-11-26 14:27 GMT

దిశ, గద్వాల్ కలెక్టరేట్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి మంగళవారం న్యూఢిల్లీ నుంచి రాష్ట్రంలోని మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కేంద్రాలలో గన్ని సంచులు, ప్యాడి క్లీనర్స్, అందుబాటులో ఉంచుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసి రైతులకు వెంటవెంటనే డబ్బులు పడే విధంగా సంబంధిత జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. సన్న రకంకు బోనస్ డబ్బులు వెంటనే మంజూరు చేయాలన్నారు.

ఈనెల 30న మహబూబ్ నగర్ రైతు సదస్సు నిర్వహించే లోపు రైతులందరికీ వారి వారి ఖాతాలలో ధాన్యం కొనుగోలు డబ్బులు పడేలా ఆర్థిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, పోరా సరఫరాల అధికారి స్వామి కుమార్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ విమల, వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, అడిషనల్ పిడి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.


Similar News