సమస్యల నిలయంగా మారిన కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం

దిశ,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం పాటిగడ్డ లోని కస్తూర్భాగాంధీ

Update: 2022-03-17 10:45 GMT

దిశ,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం పాటిగడ్డ లోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం సమస్యల నిలయంగా మారింది. పేద విద్యార్థులకు చదువు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రప్రభుత్వం మండలాలలో సంక్షేమ హాస్టళ్లు,కేజీబీవీ‌లు ఏర్పాటు చేస్తే అధికారుల అలసత్వంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. బుధవారం విద్యాలయంలో దాదాపు 385 మందికి గాను 298 మంది విద్యార్థినిలు హాజరయ్యారు. వారికి సరిపోయినంత భోజనం మాత్రం వండలేదు.చాలీచాలని పదార్థాలు వండారు.అదేవిధంగా విద్యాలయం ఆవరణలోనే చెత్తను పారేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇది కేశంపేట గ్రామపంచాయతీ కిందికి వస్తుందని స్థానిక గ్రామపంచాయతీ వారు సేకరించడంలేదనే సమాధానం వారినుంచి వచ్చింది. చెత్తను అక్కడే కాల్చివేస్తుండటంతో ఆవరణ పొగతో నిండిపోతుంది. అసలే పాటిగడ్డ కస్తూర్భా కొంత నిర్మానుషప్రదేశంలో ఉంటుంది. విద్యార్థినుల రక్షణకోసం సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. అక్కడ 5 సీసీ కెమెరాలు ఉన్న ఒక్కటికూడా పనిచేయడం లేదు. ఇక రక్షణ సంగతి దేవుడికెరుక అన్నట్లుగా పరిస్థితి ఉంది. విద్యార్థుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో యూనిట్ ప్లాంట్ పనిచేయడం లేదు, అందువలన వారికి బోర్ వాటరే దిక్కయింది.అలాగే విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ కోసం స్వచ్ఛందసంస్థ వారు కంప్యూటర్‌లు అందజేసినా, శిక్షణ ఇచ్చేవారు లేక అవి నిరుపయోగంగా మారినవి.ఈవిధంగా సమస్యలకు నిలయంగా కస్తూర్భా మారిపోయింది.చిన్నచిన్న సమస్యలే కానీ పరిష్కారంకు అధికారులు చొరవ చూపడంలేదు.


 



 

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..

కస్తూర్భాలో చిన్నచిన్న సమస్యలు ఉన్నది వాస్తవమే. సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వాటిని త్వరలోనే పరిష్కరించేవిధంగా కృషిచేస్తాను. అలాగే చెత్త సమస్యను స్థానిక పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లాం. ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఆర్వో ప్లాంటు‌కు సరిపోయిన నీళ్లు అందుబాటులో లేక కనెక్షన్ ఇవ్వలేదు.ఇప్పుడు ఆఇబ్బందిలేదు.త్వరలోనే కనెక్షన్ ఇపిస్తాం.మినరల్ వాటర్ తెప్పించి విద్యార్థులకు అందిస్తున్నాం.

గౌసియా బేగం,కేశంపేట కేజిబివి స్పెషల్ ఆఫీసర్.

Tags:    

Similar News