ప్రాంగణాలు అధ్వానం.. ఆటలకు దూరంగా క్రీడాకారులు
ఏజెన్సీ గ్రామాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన
దిశ,కొత్తగూడెం రూరల్: ఏజెన్సీ గ్రామాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన క్రీడా ప్రాంగణాలు అలంకారప్రాయంగా నిలిచినట్లుగా ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల సరైన పర్యవేక్షణ లేని కారణంగానే క్రీడా మైదానాలు నిరుపయోగంగా మారి అసాంఘిక కార్యకలాపాలకు నిలిచాయని పలువురు ఆరోపించడం గమనార్హం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న చుంచుపల్లి మండల పరిధిలోని రామాంజనేయ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తెలంగాణ క్రీడా ప్రాంగణం ఉండి ఉపయోగం లేకుండా పోతుంది. మైదానంలో ఆటలు ఆడుకునేందుకు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదు. కారణంగా క్రీడాకారులు ప్రాంగణంలో ఆటలు ఆడుకో లేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా క్రీడా స్థలం పిచ్చి మొక్కలు గడ్డి రేగిపండ్ల ముళ్ళకంప తో నిండిపోయి దర్శనమిస్తుంది. మైదానంలో కేవలం వ్యాయామం చేసుకునేందుకు మూడు ఐరన్ పోల్స్ మాత్రమే కనబడుతున్నాయి. ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నప్పటికీ వాలీబాల్ ఖోఖో లాంగ్ జంప్ హై జంప్ కు సంబంధించిన కనీస వసతులను పంచాయతీ అధికారులు ఏర్పాటు చేయడంలో విఫలమైనట్లుగా పలువురి నుంచి విమర్శలు రావడం చర్చనీయాంశంగా మారింది. గత పాలక ప్రభుత్వం మొక్కుబడిగా క్రీడాకారులకు క్రీడా కిట్లను పంపిణీ చేసి చేతులు దులుపుకుంది తప్ప క్రీడా సముదాయాలలో కనీస వసతులు కల్పించడంలో శ్రద్ధ చూపలేదని పలువురు క్రీడాకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కనీస వసతులు కల్పించాలి: కరాటే మాస్టర్ మొగిలి...
చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి సుజాతనగర్ మండలాల పరిధిలోని ఆయా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలలో కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల మైదానాలు వెలవెలబోతున్నాయి. క్రీడాకారులను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు అధికారులు చర్యలు తీసుకొని అలంకారప్రాయంగా నిలిచిపోయిన క్రీడా మైదానాలను అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రాంగణాలలో మరుగుదొడ్ల తో పాటు విద్యుత్ లైటింగ్ ను ఏర్పాటు చేసి క్రీడలకు సంబంధించిన సామాగ్రిని మొత్తం ఏర్పాటు చేయాలి.