ముక్కోటికి ముస్తాబు..లక్ష మంది భక్తులు వస్తారని ఏర్పాట్లు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం

Update: 2024-12-19 10:36 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 31 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలలో వచ్చే ఏడాది జనవరి 9 న శ్రీ స్వామి వారికి పవిత్ర గోదావరిలో తెప్పోత్సవం, 10 న ఉదయం 5.30 గంటలకు ఉత్తర ద్వార దర్శనం అత్యంత ముఖ్యమైనవి. ఈ వేడుకలు తిలకించిడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా... ఇతర రాష్ట్రాలకు చెందిన లక్ష మందికి పైగా భక్తులు భద్రాద్రి వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు రామాలయాన్ని సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. ఆలయానికి రంగులు, విద్యుత్ దీపాల అలంకరణ పనులు వడి వడిగా సాగుతున్నాయి. ఉత్తర ద్వారంలో స్వామి వారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతంలోని భక్తుల సౌకర్యార్ధం గ్యాలరీ టికెట్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉంచారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు గురించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ లో ముద్రించిన వాల్ పోస్టర్స్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు.


Similar News