మళ్లీ మొదలుపెట్టారు.. గుట్టను గుల్ల చేస్తున్న మైనింగ్ మాఫియా
దమ్మపేటలో గుట్టలు మాయం..
దిశ,దమ్మపేట: దమ్మపేటలో గుట్టలు మాయం.. అర్ధరాత్రి మట్టి రవాణా అనే కథనాలతో దిశలో ఇటీవల వరుస కథనాలు ప్రచురించింది.దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో జరుగుతున్న మట్టి తోలకాలు కొన్ని రోజుల పాటు నిలిచిపోయాయి. మట్టి తరలింపుకు షార్ట్ బ్రేక్ ఇచ్చిన మాఫియా రాయుళ్లు బుధవారం రాత్రి నుండి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రెవెన్యూ, మైనింగ్ అధికారుల కళ్లు గప్పి రాత్రి సమయంలో ప్రభుత్వ సొమ్మును దర్జాగా తరలించబోతున్నారు. మళ్లీ మొదలైన మిడ్ నైట్ మట్టి మాఫియా పై దిశ ప్రత్యేక కథనం.
మందలపల్లి గ్రామంలో ప్రభుత్వ భూముల్లో నుండి మట్టి తరలింపు మళ్లీ మొదలయ్యాయి. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కొంతమంది మట్టి మాఫియా రాయుళ్లు, యదేచ్చగా వేరే ప్రాంతాలకు మట్టిని తరలించకపోతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ భూములే లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వ సంపదను నాశనం చేస్తున్నారు. ఈ తతంగం అంతా అధికారుల దృష్టికి వెళ్తున్నా వారు ఎటువంటి చర్యలు చేపట్టకుండా చూసి చూడనట్లుగా వదిలేస్తుండడం తో అక్రమ మట్టి వ్యాపారానికి అడ్డే లేకుండా పోతుంది. మందలపల్లి గుట్టలను ఎవరైనా ఉన్నతాధికారులు పరిశీలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.. ఇప్పటికే మందలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనకాల ఉన్న గుట్టలు సగానికి పైగా మాయమైపోయాయి.
అధికారులకు తలనొప్పిగా మారిన మందలపల్లి మట్టి మాఫియా ఎపిసోడ్
మందలపల్లి మట్టి మాఫియా ఎపిసోడ్ అధికారులకు తలనొప్పిగా మారింది, సంబంధిత అధికారులు తమ విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకున్న తర్వాత మట్టి మాఫియా రాయుళ్లు రోడ్లపైకి చేరుకుంటున్నారు, గుట్టలనే లక్ష్యంగా చేసుకొని భారీ జెసిబి సహాయంతో గుట్టలను కొల్లగొట్టేస్తున్నారు. అధికారులు డ్యూటీ లో ఉన్నంత సేపు ప్రశాంతంగానే ఉంటున్న గుట్టలు, అధికారులు మళ్లీ తిరిగి మరుసటి రోజు డ్యూటీ లో చేరే సమయానికి గుట్టలు గుల్ల అవుతున్నాయి. దీంతో మందలపల్లి మట్టి మాఫీ ఎపిసోడ్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.
బుధవారం రాత్రి భారీగా తరలి పోయిన మట్టి..
బుధవారం రాత్రి మందలపల్లి గుట్టల నుంచి భారీగా మట్టి తరలిపోయింది. మందలపల్లి గుట్టల నుండి మట్టి తరలించకపోయారన్న సమాచారం మేరకు అక్కడ పరిస్థితులను పరిశీలించిన కొంతమంది మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు, గుట్టలను భారీ యంత్రాల సాయంతో, గుట్టలను నలుదిక్కులు తవ్వకాలు చేపట్టారు. ఇదంతా కలిసి బుధవారం రాత్రికి రాత్రే సుమారు 500 ట్రిప్పులకు పైగా మట్టి తరలి పోయినట్లు అక్కడ చూసిన పరిస్థితులు బట్టి తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు మందలపల్లి గుట్టలను కాపాడాలని, ప్రభుత్వ భూముల్లో మట్టి తరలించకపోకుండా సహజ సంపదను కాపాడడానికి ప్రభుత్వ భూములు చుట్టూ ట్రెంచ్(కందకాలు) తవ్వితే గాని మట్టి తరలింపుకు అడ్డుకట్ట పడదని ప్రకృతి ప్రేమికులు, ప్రజలు కోరుకుంటున్నారు.