హస్తం గూటికి పట్నం చేరితే...?

దిశ, తాండూరు: హస్తం గూటికి పట్నం మహేందర్ రెడ్డి చేరితే టీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం కలుగుతుందా...?Latest News about MLC Patnam Mahendhar Reddy

Update: 2022-07-16 05:51 GMT

దిశ, తాండూరు: హస్తం గూటికి పట్నం మహేందర్ రెడ్డి చేరితే టీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం కలుగుతుందా...? కాంగ్రెస్ పార్టీలోకి మహేందర్ రెడ్డి చేరేందుకు సిద్ధంగా ఉన్నారా..? కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రికి మంత్రి పదవి లభిస్తుందా...? ఇలాంటి ప్రశ్నలు, అనుమానాలు తాండూరు రాజకీయాల్లో మొదలయ్యాయి. తాజాగా గత కొన్ని రోజుల నుండి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగానే వినపడుతున్నాయి. కానీ టీఆర్ఎస్ నాయకులు, పట్నం అభిమానులు మాత్రం ఆరోపణలను కొట్టి పడేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ పార్టీ నుండే ఎమ్మెల్యే బరిలో ఉంటారని తేల్చి చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో రచ్చకు లేస్తున్న వర్గ విబేధాలతో విసిగిపోయి పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరితే ఎమ్మెల్యే టికెట్ పట్నంకే దక్కుతుందా.? ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందనే పార్టీ మారబోతున్నారా...? అనే ప్రశ్నలు తాండూరు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఒకవేళ మహేందర్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే ఆరోపణలు నిజమే అయితే.... ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి ఎమ్మెల్యే టికెట్ ఆశించే అవకాశం ఉంది. అలాగే తాండూరు నియోజకవర్గం ఇంచార్జ్ టీపీసీసీ ఉపధ్యక్షుడు రమేష్ మహారాజ్ చేసిన ప్రకటనలు వెన్నకి తీసుకుంటారా.? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని, మహేందర్ రెడ్డి లాంటి బడా నాయకుడి రాకతో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ బలం లభిస్తుందని ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం పట్నం మహేందర్ రెడ్డి పయనం ఎటువైపో అనేది ఆసక్తిగా మారింది. దీంతో తాండూరు నియోజకవర్గంలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం జోరుగానే సాగుతుందని భావించవచ్చు. పట్నం మహేందర్ రెడ్డి వేసే అడుగుతో నియోజకవర్గంలో రాజకీయంలో ఇంకా ఉత్సహంగా మరే అవకాశం ఉంది.


Similar News