దమ్ముంటే చర్చకు రా.. నీ అక్రమాల చిట్టతో బహిరంగ చర్చకు సిద్ధం: నందీశ్వర్ గౌడ్

దిశ, అమీన్ పూర్ : పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భూములను కబ్జా చేసి, కొన్ని వేల కోట్లు latest telugu news..

Update: 2022-03-26 16:54 GMT

దిశ, అమీన్ పూర్ : పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భూములను కబ్జా చేసి, కొన్ని వేల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నాడని, ఆయన పేరు మైపాల్ రెడ్డి కాదని.. పాపాల రెడ్డి అని.. ఆయన పాపం పండే రోజులు దగ్గరలో ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విసిరిన సవాల్‌కు స్పందిస్తూ.. ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అక్రమాలపై ఆధారాలతో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన తమ్ముడు షాడో ఎమ్మెల్యే గా వ్యవహరిస్తున్న మధుసూదన్ రెడ్డి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతూ.. భారీ స్థాయిలో భూ కబ్జాలు చేసి వేల కోట్ల ప్రజల సొమ్ముని కాజేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో పటాన్ చెరు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి మరెక్కడా జరగడం లేదని ఇంత భారీ స్థాయిలో కబ్జాలు చేస్తూ.. తనకేం తెలియనట్లు గజం భూమి కబ్జా చేయలేదని మాయ మాటలు చెబుతున్నాడని మండిపడ్డారు.

గజం కబ్జా అయినా నిరూపిస్తే పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ముందు విషం తాగి చస్తా అని భారీ డైలాగులు కొడుతున్నాడని, ఆయన భూముల కబ్జా బాగోతాన్ని మొత్తం ఆధారాలతో నిరూపిస్తానని.. బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రతి సవాల్ విసిరారు. ఆరోపణలు రుజువైతే నీ ప్రాణ త్యాగం అక్కర్లేదు.. నువ్వు అన్యాయంగా దోచుకున్న సంపదను, అన్యాయంగా కబ్జా చేసిన సామాన్యుల భూములను తిరిగి బాధితులకు అప్పజెప్పి క్షమాపణ చెప్తే చాలన్నారు. లక్డారం పరిధిలో సంతోష్ గ్రానైట్ సప్లై పేరుతో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి కేవలం 10 ఎకరాల లోపు అనుమతి పొంది పక్కనున్న 40 ఎకరాల శిఖం భూమి కబ్జా చేశారని ఆరోపించారు. ఈ క్రషర్ ద్వారా నెలకు నాలుగు లక్షల టన్నుల గ్రానైట్ ను ఉత్పత్తి చేసి రూ.12 కోట్లు సంపాదిస్తున్నారని, ప్రభుత్వానికి సంవత్సరానికి కోటి రూపాయలు రాయల్టీ కట్టాల్సి ఉండగా అన్ని రకాల పన్నులు ఎగ్గొడుతూ.. కేవలం రూ.4,20, 000 రాయల్టీ మాత్రమే కడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ సొమ్మును దోచుకుంటూ వాతావరణాన్ని కలుషితం చేస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రశ్నించిన గ్రామస్తులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

అమీన్ పూర్ పరిధిలో సర్వేనెంబర్ 119 లో 1982 సంవత్సరంలో విద్యుత్ సౌద ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో 130 ఎకరాలు లే అవుట్ ప్లాట్లు చేస్తే ఆ లే ఔట్‌ని మార్చి ఫోర్జరీ లే ఔట్ చేసి దొంగతనంగా ప్లాట్లు అమ్ముతున్నారని, తెలంగాణ విద్యుత్ శాఖ ఎండీ ప్రభాకర్ రావు సైతం ఇందులో ఒక బాధితుడు అని పేర్కొన్నారు. ఐలాపూర్ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 135/2, 135/3 అసైన్డ్ భూమి కబ్జా చేసి కిష్టారెడ్డిపేట్ గ్రామ పంచాయతీ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసి నిర్మాణాలు చేస్తుంది నిజం కాదా అని ప్రశ్నించారు. 2006లో సర్వే నెంబర్ 171/ఇ లో 14 ఎకరాలను వైజాగ్ కి చెందిన వ్యక్తి కొనుగోలు చేస్తే సాక్షాత్తు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సాక్షి సంతకం చేశాడని, ఇప్పుడు ఆ భూమిని కబ్జా చేసి ఆ భూమిని తనకు అమ్మామని బెదిరిస్తున్నాడని సదరు కొనుగోలుదారు ఆ భూమి అమ్మడానికి ససేమిరా అనడంతో భూమిలోకి అడుగుపెడితే చంపుతామని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. పెదకంజర్ల గ్రామ పరిధిలో సుమారు ఐదు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాలుగా మార్చి భారీ కుంభకోణానికి తెర తీసింది నీవు కదా అని విమర్శించారు. పటాన్ చెరు పరిధిలో రోడ్డుని, సుమారు ఎకరా ఉన్న నాలాని కబ్జా చేసి జీఎంఆర్ ఫంక్షన్ హాల్ ని నిర్మించారని, ఈ విషయం పటాన్ చెరు‌లో ప్రతి ఒక పౌరుడికి తెలుసని తెలిపారు. తనతో పాటు ఉండే వ్యక్తులకు చెందిన ఎకరం భూమి ఫంక్షన్ హాల్ పక్కనే ఉండడంతో తప్పుడు కేసు వేయించి, బెదిరించి 15 కోట్ల భూమిని 2 కోట్లకు కొన్నాది ఎవరని ప్రశ్నించారు. పటాన్ చెరు‌లో పార్కులను కబ్జా చేసి భవంతులను నిర్మించి, పాఠశాలను కూల్చి పార్కులను నిర్మిస్తున్నారని ఇలాంటి వింత పనులు చెయ్యడం ఎమ్మెల్యే కె సాధ్యమన్నారు.

పటాన్ చెరు పరిధిలో సాయి రామ్ నగర్ కాలనీ లో 2019 లో చనిపోయిన వ్యక్తి మీద తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి సుమారు 60 కోట్ల విలువ గల 50 ప్లాట్లను ఎమ్మెల్యే తమ్ముడు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, పటాన్చెరు అసెంబ్లీ బిజెపి కన్వీనర్ శ్రీనివాస గుప్తా ఫ్లాట్ లను సైతం ఇందులో కబ్జా చేశారని, ఈ వ్యవహారంలో హైకోర్టు ద్వారా ఆయన మీద ఎఫ్ ఐ ఆర్ ఇష్యూ అయిన అరెస్ట్ చేయకుండా పోలీసులు సహకరిస్తున్నారని, మొత్తం ప్రభుత్వ అధికారులను పోలీసు యంత్రాంగాన్ని తన చేతిలో పెట్టుకొని అరాచకం చేస్తున్నారని విమర్శించారు. తెల్లాపూర్ పరిధిలో 30 వేల కోట్ల భూ కుంభకోణానికి తెర తీశారని వాటికి సంబంధించిన వివరాలు త్వరలో బయట పెడతానన్నారు. పటాన్ చెరు ఎమ్మార్వో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ఎమ్మెల్యే కి సహకరిస్తూ వందల కోట్లు అక్రమంగా సంపాందించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వెంటనే ఆయనపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అల్లుడు జంగారెడ్డి పాటి ఘనపూర్ పరిదిలో సామాన్యులకు చెందిన 1100 ప్లాట్లను చుట్టూ రేకులను వేసి కబ్జా చేశాడన్నారు.

అమీన్ పూర్ పరిధిలో చెరువులను, ప్రభుత్వ భూములను కబ్జా చేసి సొమ్ము చేసుకుంటున్నాడని, ఈ కబ్జాలలో 40% వాటా ఎమ్మెల్యేకు, 20% వాటా అధికారులకు వెళ్తుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా స్మశాన వాటికలు, చెరువులు, నాలలు, పార్కులు,దేవాలయ భూములు వేటిని వదలట్లేదు అని ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేయడం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు అలవాటుగా మారిందన్నారు. నిన్నటికి నిన్న పాశా మైలారం పరిధిలో 2 ఎకరాల భూమి కబ్జాకు ఎమ్మెల్యే తమ్ముడు ఆయన అనుచరులు ప్రయత్నించారని, అక్కడ గ్రామస్థులు ప్రతిఘటించడంతో పారిపోయి వచ్చారని తెలిపారు. ఇక నా హయాంలో ఎం అభివృద్ధి చేశావు అని ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడని, అభివృద్ధికి సంబంధించిన చరిత్ర మార్చలేమని, అవి అధికారుల దగ్గర అందుబాటులో ఉన్నాయని ఒక సారి పరిశీలించాలని హితవు పలికారు. దేవాలయాల అభివృద్ధికి నిధులు ఇస్తున్నాను అని చెప్తున్న ఎమ్మెల్యే తమ ఇంటి పక్కనే ఉన్న రామాలయం భూమిని కబ్జా చేసి పార్కింగ్ కోసం వాడుతున్నాడు అని , నీవు చేస్తున్న పాపాలను ఆ దేవుడు క్షమించడని హెచ్చరించారు.

తాను చేస్తున్న అవినీతి అక్రమాలు బయట పడుతుండడంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కి టికెట్ రాదని ప్రచారం జరుగుతుండడంతో ఒత్తిడిలో ఎమ్మెల్యే నోటికొచ్చింది మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. గతంలో ఎమ్మెల్యే మీద ఉన్న కేసు సుప్రీంకోర్టులో విగిపోయిందని.. అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని తనపై కేసు పెట్టిన పారిశ్రామికవేత్తను మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి సహకారంతో చంపుతామని బెదిరించిన కేసు వాపసు తీసుకునేలా చేశారని దీనికి సంబంధించిన మధ్యవర్తికి పటాన్ చెరులో 6 ఎకరాల విలువైన భూమిని కట్టబెట్టింది ఎవరని ప్రశ్నించారు. ఎమ్మెల్యే విసిరిన సవాల్ స్వీకరిస్తున్నానని, ఆయన అవినీతి భూ కబ్జాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ముందు చర్చకు సిద్ధమని తెలిపారు. తాను చెబుతుంది నిజం కాకపోతే తనను జైల్లో పెట్టి.. కొట్టి చంపండని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే బెదిరింపులకు బెదిరేది లేదని ఎమ్మెల్యేకు సంబంధించిన భూ బాధితులు తనను సంప్రదించాలని వారందరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News