రైతు రాఘవరెడ్డిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే : జీవన్ రెడ్డి ఫైర్
రామడుగు మండలం శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన రైతు రాఘవరెడ్డి తనకున్న కొద్దిపాటి భూమిని అదనపు టిఎంసి
దిశ, రామడుగు : రామడుగు మండలం శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన రైతు రాఘవరెడ్డి తనకున్న కొద్దిపాటి భూమిని అదనపు టిఎంసి కాలువ కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తుందన్న బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం ఎంఎల్సీ జీవన్ రెడ్డి.. చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మేడిపల్లి సత్యంతో కలిసి రాఘవరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంతకుముందే కాళేశ్వరం ప్రాజెక్టు, వరద కాలువల కింద భూములు కోల్పోయిన రైతుల నుంచి మరోమారు వరదకాలువ అదనపు టిఎంసి పేరుతో భూసేకరణ చేయడం వల్ల వారికి ఆత్మహత్యలే శరణ్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇట్టి భూసేకరణకు ఎటువంటి అనుమతులు లేవని, అయినప్పటికీ బలవంతంగా భూసేకరణ కోసం నోటీసులు ఇప్పిస్తూ గ్రామసభలు నిర్వహిస్తూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్న అధికారులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఆత్మహత్య చేసుకున్న రాఘవరెడ్డి గతంలోనే తనకున్న వ్యవసాయ భూమిని కాళేశ్వరం ప్రాజెక్టు కింద అలాగే వరద కాలువ నిర్మాణంలో కోల్పోయి ఉన్న ఒక్క ఎకరం భూమిలో సాగు చేసుకుంటు జీవనం సాగిస్తున్న పరిస్థితుల్లో ధరణి వెబ్ సైట్లో ఆయన భూమిని కేవలం 15 గుంటలు మాత్రమే తన పేరున నమోదు చేశారని మండిపడ్డారు. మిగిలిన భూమిని రికార్డుల్లో తనపేరున నమోదు చేయాలని ఎన్నోసార్లు తహశీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని, ఇటువంటి పరిస్థితుల్లో అదనపు టిఎంసి కోసం సేకరిస్తున్న భూమిలో తనకు పూర్తిస్థాయి నష్టపరిహారం రాదని, తీవ్ర మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల తప్పిదాల వల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని కాబట్టి ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగానే భావించి రైతు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు పనిచేస్తున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని లేకుంటే వీరి పైన మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామడుగు మండల అధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, కోల రమేష్, సత్య ప్రసన్న, జవ్వాజి హరీష్, పులి ఆంజనేయులు, బుర్గు గంగయ్య,బాల గౌడ్,కాడె శంకర్, బాపిరాజు,నాగి శేఖర్,కట్ల శంకర్, పంజాల శ్రీనివాస్, కృష్ణ, నిమ్మ వినోద్ రెడ్డి, అదనపు టి.ఎం.సి భూ బాధిత రైతులు సురేందర్, నర్సయ్య పాల్గొన్నారు.