సర్కారుపై ముప్పేట దాడికి ప్లాన్.. టీఆర్ఎస్ వైఫల్యాలపై రాహుల్ ఫోకస్?

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ స్పెషల్​ఫోకస్​మొదలైంది. ఇప్పటికే నేతలను ఒక్కతాటిపై ఉండాలంటూ వార్నింగ్​ ఇస్తూనే మరోవైపు తెలంగాణలో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు.

Update: 2022-04-16 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ స్పెషల్​ఫోకస్​మొదలైంది. ఇప్పటికే నేతలను ఒక్కతాటిపై ఉండాలంటూ వార్నింగ్​ ఇస్తూనే మరోవైపు తెలంగాణలో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అర్బన్ ప్రాంతాల నుంచి యూత్, గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు, వ్యవసాయ కార్మికులు టార్గెట్‌గా కాంగ్రెస్​ప్లాన్ చేస్తోంది. రాహుల్​గాంధీ టూర్​నేపథ్యంలో అటు పార్టీ వ్యూహకర్త సునీల్ గ్రౌండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లను ప్రకటించినా.. ఇంకా నిరుద్యోగుల్లో అసంతృప్తి వస్తూనే ఉండటంతో నిరుద్యోగ యువతే లక్ష్యంగా రాహుల్​ సమావేశం నిర్వహించనున్నారు. మొన్నటిదాకా ధాన్యం కొనుగోళ్లపై జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు రాష్ట్రంలో అడుగు పెట్టనున్నారు. రైతు సమస్యలను ఎజెండాగా పెట్టుకుంటూనే.. అటూ యూత్‌ను కూడా అట్రాక్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పర్యటన ఖరారు

రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. మే నెల 6, 7 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు శనివారం టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి అధికారికంగా ప్రకటించారు. దీనిలో భాగంగానే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​మాణిక్కం ఠాగూర్​కూడా రాష్ట్ర నేతలతో వరుసగా భేటీ అయ్యారు. రాహుల్​పర్యటన రెండ్రోజుల పాటు సాగనుంది. మే 6న వరంగల్ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. 'రైతు సంఘర్షణ సభ' పేరుతో నిర్వహించనున్న ఈ సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు స్వచ్ఛందంగా తరలివస్తారని నేతలు భావిస్తున్నారు. మే 7వ తేదీన హైదరాబాద్ బోయిన్‌పల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం సహా రానున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీని ఎలా సన్నద్ధం చేయాలనే విషయాలపై రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు.

పట్టు కోసం

ముఖ్యంగా, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా.. అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత ఉందని స్పష్టమవుతున్నా దాన్ని చేజిక్కించుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో అవకాశాలున్నాయని భావిస్తున్న రాహుల్ గాంధీ రాష్ట్రంలో పార్టీని పట్టాల మీదకు తెచ్చేందుకు నడుం బిగించడం పట్ల పార్టీలో సంతోషం వ్యక్తమవుతోంది. నిజానికి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ వుంది. పార్టీ క్రియాశీల సభ్యత్వం విషయంలో టీపీసీసీ ప్రథమ స్థానంలో వుంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు సమర్ధ స్థానిక నాయకత్వం వుంది. అయిన అన్నీ ఉన్నా అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి కారణంగా పార్టీ వెనకబడిపోతోందని ఇటీవల పార్టీ వ్యూహకర్త ఇచ్చిన నివేదికల్లో స్పష్టమైంది.

కలిసినట్టే ఉన్నా!

కాగా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొత్త కాదు. కాకపోతే, ఇటీవల కాలంలో అసమ్మతి ఇంకొంత కట్టుతప్పినట్లు తేలిపోయింది. జాతీయ స్థాయిలో జీ-23, రాష్ట్రంలో 'కాంగ్రెస్ విధేయుల వేదిక' వంటి అసమ్మతి వేదికలు హల్ చల్ సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కొంత అనుకూలంగా మారినట్లయింది. అయినప్పటికీ పార్టీ నేతలు ఒక్కతాటిపైకి రావడం కష్టమేనన్నట్లుగా మారింది. ఇటీవల రాష్ట్ర కీలక నేతలందరినీ ఢిల్లీకి పిలిపించి దిశానిర్దేశం చేయడమే కాకుండా గీత దాటితే వేటు తప్పదని అసమ్మతి నాయకులకు స్పసహ్తమైన హెచ్చరిక చేశారు. అధికారం కోసం అధికార పార్టీపై పోరాడాల్సింది పోయి తమలో తము పోట్లాడుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా క్రమశిక్షణ గీత దాటినా, టీఆర్ఎస్ నాయకులతో చేతులు కలిపి పార్టీకి హాని తలపెట్టిననా సహించేది లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ తాజాగా గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టారు. తనను పిలువలేదని, అందుకే వెళ్లలేదంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి విమర్శలు కూడా చేశారు. దీంతో గుర్రాన్ని రేవుకు తీసుకుపోవచ్చును కానీ నీళ్ళు తాగించలేమనే తీరు పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులను ఢిల్లీ తీసుకు పోవచ్చును కానీ, అసమ్మతిని చల్లార్చడం అయ్యే పని కాదని పార్టీ నాయకులు అంటూనే ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు సీనియర్ నాయకులు సిద్ధంగా లేరని, అలాగని పార్టీని వదిలి పోలేరని, కాబట్టి అసమ్మతి కార్యకలాపాలు కొద్ది కాలం సర్దు మనిగినట్లు కనిపించినా.. కథ మళ్ళీ మొదటికే వస్తుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

పోరుబాట లక్ష్యంగా

ఈ నేపథ్యంలో రాహుల్ టూర్ రెండు వైపులా కలిసొచ్చే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలు విశ్లేసిస్తున్నాయి. పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిని ఇప్పటికే సైలెంట్ చేసిన రాహుల్.. ఇప్పుడు రాష్ట్రానికి వస్తే క్షేత్రస్థాయి అంశాలన్నీ మరింత సద్దుమణుగుతాయని భావిస్తున్నారు. ఇప్పటికీ వేర్వేరుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర సీనియర్లు రాహుల్​సభ నేపథ్యంలో కలిసి వస్తారని, ఇదే సందర్భంలో వారందరికీ మరోసారి రాహుల్​ టూర్​ వార్నింగ్​ తరహాలోనే ఉండనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఆయా వర్గాలను తమవైపు తిప్పుకునే లక్ష్యంతోనే టీపీసీసీ.. రాహుల్ పర్యటనకు ఉర్రూతలూగుతోంది. ధాన్యం కొనుగోళ్ల అంశంపై రాహుల్​ ట్వీట్​తర్వాత రాష్ట్ర నేతలు చెలరేగిపోయారు. నిరసనలకు దూకారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ అంశంలో దిగి వచ్చినా.. ఎవరికి వారే తమ పోరాటమే అంటూ చెప్పుకుంటున్నా పోరాటం కూడా కలిసి వచ్చిందంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే సమయంలో యూత్‌ను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్​ నేత మానవతారాయ్​ నేతృత్వంలో నిరుద్యోగులతో కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలకు దిగారు. అటు కాకతీయ యూనవర్సిటీలోనూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ జేఏసీ అంటూ కాంగ్రెస్​ పార్టీ నేతృత్వంలో ఓ విభాగాన్ని తయారు చేశారు. ఇలా నిరుద్యోగులు, యువతకు సంబంధించిన అంశాలపై కూడా స్పెషల్ ఫోకస్​పెట్టారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీపై ముప్పేట దాడికి ప్లాన్​చేస్తే.. వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీకి మెజార్టీ దక్కుతుందని భావిస్తున్నారు.

సునీల్ గ్రౌండ్ రిపోర్ట్

రాహుల్ పర్యటన ఉంటుందనే సమాచారంతో ఇప్పటికే పార్టీ వ్యూహకర్త సునీల్ టీం రాష్ట్రంలో పలు అంశాలను సేకరిస్తోంది. నిరుద్యోగులు, యువతకు సంబంధించిన స్పెషల్​రిపోర్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నా.. ఇంకా రైతుల సమస్యలు, వచ్చే వానాకాలానికి వరిసాగు, ఉచిత ఎరువులు, మద్దతు ధర వంటి అంశాలపై సునీల్​ బృందం వివరాలు సేకరిస్తోంది. దీనితో పాటుగా పార్టీలో ఇంకా చల్లారని అసంతృప్తిపైనా నివేదిక సిద్ధం చేసింది. యువత, రైతు, వ్యవసాయ సంబంధిత సమస్యలపై వరంగల్​సభ వేదికగా ప్రస్తావిస్తే.. పార్టీ అంతర్గత సమస్యలు, నేతల వైఖరిపై బోయినపల్లి సభా వేదికగా రాహుల్​ చర్చించనున్నారు.

Tags:    

Similar News