యోగీపై పోటీకి బ్రాహ్మణ మహిళ: చేతన పాండేకు గోరఖ్‌పూర్ అర్బన్ కేటాయించిన కాంగ్రెస్

Update: 2022-02-10 17:12 GMT

న్యూఢిల్లీ: సీఎం యోగీ పైకి కాంగ్రెస్ బ్రాహ్మణ మహిళను బరిలోకి దింపనున్నట్లు ప్రకటించింది. యోగీ పోటీచేస్తున్న గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి చేతన పాండే బరిలోకి దిగనుంది. గాయనీ, కవయిత్రి అయిన 37 ఏళ్ల పాండే క్రితం సారి ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా షాజన్వా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగింది. అయితే కేవలం 2,200 ఓట్లు మాత్రమే సాధించింది. కాగా గతంలో ఆమె గోరఖ్‌పూర్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ సారి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతుండటంతో యోగీ పై ప్రభావం చూపనున్నట్లు పాండే భావిస్తుంది. అయితే కాంగ్రెస్ ఇప్పటికే 40 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, గురువారం ప్రకటించిన 33 మంది అభ్యర్థుల్లో 15 మంది మహిళలు ఉండటం గమనార్హం. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ శుభవతీ శుక్లాను యోగీపై పోటీకి దింపనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గోరఖ్‌పూర్ అర్బన్ స్థానానికి ఆరో విడతలో మార్చి 3న ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News