బంపర్ ఆఫర్.. టార్గెట్ చేరుకో.. ట్రాన్స్ ఫర్ పెట్టుకో

దిశ, సిటీ బ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ..latest telugu news

Update: 2022-03-30 02:06 GMT

దిశ, సిటీ బ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్‌ను పెంచుకునేందుకు ట్యాక్స్ సిబ్బందికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్‌కు సంబంధించిన టార్గెట్లు ఫిక్స్ చేసిన తర్వాత రెండు నెలల క్రితం వీరికి స్థాన చలనాలు కల్పించారు. కానీ కొత్త ఏరియాలకు వెళ్లిన వీరు తమకు కేటాయించిన డాకెట్ల ప్రకారం ఆస్తులను చూసుకుని పన్ను వసూలు చేసేందుకు కష్టమవుతున్నందున కలెక్షన్ బాగా తగ్గిందన్న విషయాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు తాము తొందరపడి తీసుకున్న బదిలీల నిర్ణయాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరోసారి ట్యాక్స్ సిబ్బందికి ట్రాన్స్ ఫర్ ఆఫర్ ఇస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కోసం క్షేత్ర స్థాయి సిబ్బందికి టార్గెట్లు ఇచ్చిన అధికారులు కలెక్షన్‌లో వెనుకబడి ఉన్న వారిని ప్రోత్సహించేందుకు సరికొత్త చిట్కాను ప్రయోగిస్తున్నారు. వారికిచ్చిన టార్గెట్ ప్రకారం పన్ను వసూలు చేస్తే వారు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్‌కి దరఖాస్తు చేసుకోవచ్చునన్న వెసులుబాటును కల్పించినట్లు సమాచారం. వర్తమాన ఆర్థిక సంవత్సరం రూ. 1850 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్‌ను టార్గెట్ గా పెట్టుకోగా, ఇప్పటి వరకు సుమారు రూ. 1480 కోట్ల వరకు పన్ను వసూలు చేశారు. అయితే ఇచ్చిన టార్గెట్ల ప్రకారం పట్టణీకరణ వేగంగా సాగుతున్న శేరిలింగంపల్లి, మాదాపూర్, ఎల్బీనగర్, కూకట్ పల్లి, చందానగర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో అధికారులిచ్చిన టార్గెట్ల ప్రకారం ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ జరుగుతున్నా, పాతబస్తీ వంటి మాస్ ఏరియాల్లోని డాకెట్ల ప్రకారం ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ తల భారంగా మారింది.

చెల్లించమని అడిగితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ట్యాక్స్ సిబ్బంది భయపడుతున్నారు. ఇలాంటి ఏరియాల్లో ట్యాక్స్ కలెక్షన్ డ్యూటీ చేసేందుకు ఇష్టం లేని ట్యాక్స్ సిబ్బంది ఇపుడిచ్చిన టార్గెట్ ప్రకారం పన్ను చెల్లించి, ఈ నెల 31 తర్వాత వేరే ఏరియాకు ట్రాన్స్ ఫర్ పెట్టుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తమకిచ్చిన టార్గెట్లను అధిగమించేందుకు పన్ను వసూలు చేసేందుకు పాట్లు పడుతున్నారు. అదే సర్కిల్ లో ఏళ్ల తరబడి పని చేస్తున్న బిల్ కలెక్టర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల సహాయంతో ఏదోలాగా ఈ సారి అధికారులిచ్చిన లక్ష్యం మేరకు ట్యాక్స్ వసూలు చేసి, అక్కడి నుంచి వేరే సర్కిల్ కు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలన్న ప్లాన్ తో మరి కొందరు ట్యాక్స్ సిబ్బంది పన్ను వసూలు చేస్తున్నట్లు తెలిసింది.

చివరి రెండు రోజులే కీలకం

జీహెచ్ఎంసీ టార్గెట్‌గా పెట్టుకున్న ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేసుకునేందుకు బుధ, గురువారాలే కీలకమైన రోజులుగా చెప్పవచ్చు. క్షేత్ర స్థాయిలో ట్యాక్స్ వసూలు చేసే సిబ్బంది చివరి రోజైన 31న ఎంత పన్ను వసూలు చేసినా, ఆన్ లైన్ లో, మీ సేవ, ఈ సేవ కేంద్రాలతో పాటు బకాయిదారులు స్వచ్చందంగా చెల్లించటంతో అర్ధరాత్రి వరకు రూ. వంద కోట్ల పై చిలుకు పన్నువసూలవుతుంది. ఈ టార్గెట్ చేరేందుకు అవసరమైన రూ. 200 కోట్ల నుంచి రూ. 250 కోట్ల వరకు ట్యాక్స్ సిబ్బంది వసూలు చేయాల్సి ఉంది. వీటిలో ఏళ్ల నుంచి భారీగా బకాయిపడ్డ కోట్లాది మొండి బకాయిలు కూడా ఉన్నట్లు సమాచారం. ఆయా సంస్థలు ఇచ్చిన హామీ ప్రకారం చెల్లిస్తే అధికారులు ఈ ఏటా లక్ష్యంగా పెట్టుకున్న రూ. 1850 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి కల్లా బల్దియా ఖజానాకు చేరే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News