హమీద్ అన్సారీకి పాక్ జర్నలిస్టుతో లింకులు!

న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి పాకిస్తాన్ కు చెందిన జర్నలిస్టుకు సంబంధాలున్నాయనే ఆరోపణల దాడిని బీజేపీ మరింత పెంచింది..Latest Telugu News

Update: 2022-07-15 09:44 GMT

న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి పాకిస్తాన్ కు చెందిన జర్నలిస్టుకు సంబంధాలున్నాయనే ఆరోపణల దాడిని బీజేపీ మరింత పెంచింది. శుక్రవారం హమీద్ అన్సారీ జర్నలిస్టుతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ విమర్శలు చేసింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా ఉగ్రవాదంపై 2009లో నిర్వహించిన సమావేశంలో నుస్రత్ మీర్జా హజరైనట్లు ఉన్న ఫోటోను మీడియాకు చూపించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నుస్రత్ మీర్జాతో వేదికను పంచుకోకూడదని భాటియా అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి, విదేశాల నుండి ప్రముఖులను ఆహ్వానించడానికి ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ అవసరమని చెప్పారు.

రాజ్యాంగ‌బద్దమైన నేతల సమావేశంలో పాకిస్తాన్ నుండి ఒక వ్యక్తి భారతదేశంలోకి ప్రవేశించాలని కాంగ్రెస్ కోరుకుంటుందని, దాని సమగ్రతను దెబ్బతీయడం సరికాదని ఆయన ఆరోపించారు. అంతకముందు యూపీఏ హయాంలో తాను ఐదుసార్లు భారత్‌కు వచ్చానని, ఇక్కడ సేకరించిన సున్నితమైన సమాచారాన్ని తమ దేశ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకి చేరవేసినట్లు పాకిస్థాన్ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జా పేర్కొన్నారు. హమీద్ అన్సారీ ఆహ్వానం మేరకు తాను సమావేశమయ్యారని చెప్పారు. అయితే మిర్జా ఆరోపణలపై స్పందించిన అన్సారీ తానెవ్వరిని ఆహ్వానించలేదని, తప్పుడు ఆరోపణలు అని అన్నారు. మరోవైపు సెమినార్‌కు పాక్ జర్నలిస్టును ఆహ్వానించింది నిజమేనని, తాము తిరస్కరించామని ఆర్గనైజర్ అక్షిత నందగోపాల్ ట్వీట్ చేశారు. 


Similar News