మూల మలుపులతో ముప్పు..పట్టించుకోని అధికారులు

మండల పరిధిలోని రుద్రారం గ్రామ సమీపంలో కూచూరు గ్రామం వైపు వెళ్లే దారి మూల మలుపులో చెట్లు ఏపుగా పెరిగాయి.

Update: 2024-11-25 09:32 GMT

దిశ,నవాబుపేట : మండల పరిధిలోని రుద్రారం గ్రామ సమీపంలో కూచూరు గ్రామం వైపు వెళ్లే దారి మూల మలుపులో చెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో  కూడలి ప్రమాదకరంగా మారింది. గతంలో కూడా ప్రస్తుతం పెరిగిన విధంగా చెట్లు ఏపుగా పెరిగిన సమయంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నవాబుపేట నుంచి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వెళ్లే దారిలో రుద్రారం గ్రామం దగ్గర రోడ్డు నిటారుగా ఉండడంతో..వాహనాలు విపరీతమైన స్పీడ్ తో వెళ్తుంటాయి. దీంతో అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కూచూరు గ్రామానికి చెందిన ఈడిగి నర్సింలు గౌడ్ తమ గ్రామం వైపు నుంచి నవాబుపేటకు బైక్ పై వెళ్తూ.. అదే మలుపు వద్ద బస్సు ఎదురుగా కనిపించక పోవడంతో బస్సుకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన మృతికి ముందు కూడా అనేకమంది ఆ ప్రాంతంలో ప్రమాదాలకు గురై క్షతగాత్రులయ్యారు. దీంతో స్పందించిన అధికారులు అక్కడ పెరిగిన చెట్లను తొలగించడంతో..కొంతకాలం వరకు అక్కడ ప్రమాదాలు జరగలేదు. గత కొంతకాలంగా మళ్లీ చెట్లు ఏపుగా పెరగడంతో ప్రమాదాల పరంపర కొనసాగుతున్నాయి. దీంతో మలుపు వద్ద ప్రయాణం చేయడానికి ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మలుపు వద్ద ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేయించి, ప్రయాణ మార్గాన్ని సురక్షితం చేయాలని వాహనచోదకులు డిమాండ్ చేస్తున్నారు.  గతంలో జరిగిన ప్రమాద సంఘటనలు పునరావృత్తం కాకముందే తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.


Similar News