TG Govt: తెలంగాణ యువతకు BIG అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల
ప్రైవేటు రంగంలో తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలను భాగస్వామ్యం చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ప్రారంభించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు రంగంలో తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలను భాగస్వామ్యం చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ప్రారంభించింది. రాష్ర్టంలో అభివృద్థి చెందుతున్న 17 ప్రాధాన్య రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు సరిపడే మానవ వనరులను తయారు చేసేలా కొత్త కోర్సులను ఐటీ, పరిశ్రమల శాఖ రూపొందించింది. ప్రాధాన్య రంగాల్లో ఫార్మా, కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ తదితరాలు ఉన్నాయి. కాగా.. సంబంధిత రంగంలో పేరొందిన కంపెనీల భాగస్వామ్యంతో కోర్సులను రూపొందించి యువతకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు అదే కంపెనీలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని, తాజాగా ‘యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ’ కిమ్స్, ఏఐజీ ఆసుపత్రులు, టీ – వర్క్స్ భాగస్వామ్యంతో 3 కోర్సులకు నోటిఫికేషన్లను జారీ చేస్తున్నట్లు తెలిపింది.
కాగా.. త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభించేందుకు యూనివర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారని, కోర్సులకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు నిరుద్యోగులు తరచూ ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి చెందిన www.yisu.in వెబ్ సైట్లో చూడాలని యూనివర్సిటీ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మోదటిది ఏఐజీ హాస్పిటల్స్ ఎండోస్కోపీ టెక్నీషియన్ ట్రైనింగ్ ప్రోగ్రాం వ్యవధి ఆరు నెలలు ఉంటుందని, ఇంటర్(బైపీసీ)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి 25 ఏళ్లలోపు వయస్సు గల వారు అర్హులు అని అధికారులు పేర్కొంటున్నారు. ఎండోస్కోపీ ఆపరేషన్స్‌పై క్లాస్ రూం, ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో శిక్షణ ఇస్తారని, ఏఐజీ, ఇతర ఆసుపత్రుల్లో ప్లేస్ మెంట్ ఫీజు; రూ.10వేలు ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని తెలియజేస్తున్నారు. ఇకరెండోది టీ వర్క్స్ ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రాం అని, దీనికి వ్యవధి 2 నెలలు కాగా, పదో తరగతి ఉత్తీర్ణత గల 18- 25 ఏళ్లలోపు వయస్సు గల వారు అర్హులు అని పేర్కొంటున్నారు. డిజైన్ థింకింగ్, క్యాడ్, క్యామ్పై అవగాహన కల్పించడం, 3డీ ప్రింటింగ్, వెల్డింగ్, సీఎన్సీ మెషినింగ్, అడ్వాన్స్ డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, ప్యాకేజింగ్, వుడ్ , లేజర్ కటింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారని, ఉపాధి అవకాశాలుగా జూనియర్ ప్రోటో టైపింగ్ టెక్నీషియన్‌గా అవకాశం ఉంటుందని వేతనం కూడా రూ.15వేల నుంచి రూ.25వేల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.