RRR దక్షిణ భాగం టెండర్లకు తెలంగాణ సర్కార్ ఆహ్వానం
ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీకి కన్సల్టెంటు నియామకం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ టెండర్లను ఆహ్వానించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీకి కన్సల్టెంటు నియామకం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ టెండర్లను ఆహ్వానించింది. ఇంతకు ముందు హైదరాబాద్ ప్రాంతీయ రహదారి(ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి జాతీయ రహదారుల శాఖ టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ భాగం సమగ్ర ప్రాజక్టు నివేదిక(డీపీఆర్) తయారీపై చర్యలు తీసుకుంటోంది. ఈ డీపీఆర్ తయారీ కోసం గత నవంబర్ 25న గ్లోబల్ టెండర్లు పిలిచినప్పటీకీ కూడా కన్సల్టెంటు సంస్థలు మాత్రం ముందుకు రాలేకపోయాయి. దీంతో గురువారం తాజాగా రీటెండర్ పిలిచినట్లు రోడ్లు భవనాల శాఖ అధికారులు తెలిపారు.
కాగా, వచ్చేనెల 9వ తేదీ వరకు టెండర్లకు గడువిచ్చారు. నాలుగు లేన్ల ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని నిర్ణయించారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం పనులకు ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లు ఆహ్వానించిన విషయం విధితమే. దక్షిణ భాగం పనులు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టాలని ముందు భావించినప్పటికీ.. ఇటీవల ఆ పనులు కూడా ఎన్‌హెచ్‌ఏఐ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు. కాగా ఈ క్రమంలో డీపీఆర్ తయారుచేసి కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. వాస్తవానికి ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగానికి గతంలో రూపొందించిన అలైన్‌మెంటులో మార్పులు జరిగినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా డీపీఆర్ తయారీకి అధికారులు టెండర్లు ఆహ్వానించారు. దక్షిణ భాగం ఉప్పల్, షాద్‌నగర్ మీదుగా సంగారెడ్డి వరకు సుమారు 182.23 కిలోమీటర్లు ఉంటుందని అధికారులు వెల్లడించడం గమనార్హం.