తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జి ఎక్కడ?

పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ ఇక తన తర్వాతి టార్గెట్ గా స్థానిక సంస్థలను పెట్టుకుంది.

Update: 2024-07-08 03:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ ఇక తన తర్వాతి టార్గెట్ గా స్థానిక సంస్థలను పెట్టుకుంది. ఇప్పటికే బీజేవైఎం తో పాటు మహిళా మోర్చా నేతలు ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. అయితే హైకమాండ్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇన్‌చార్జీలు, కో ఇన్‌చార్జీలను నియమించింది కానీ తెలంగాణకు మాత్రం ప్రకటించలేదు. పెండింగులోనే పెట్టింది. ఈ అంశమే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీగా తరుణ్ చుగ్, కో ఇన్ చార్జీగా అర్వింద్ మీనన్ ఉన్నారు. కానీ వారిరువురు ఈ మధ్య పెద్దగా ఎలాంటి యాక్టివిటీలోనూ పాల్గొనడం లేదు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కో ఇన్ చార్జి అర్వింద్ మీనన్ ఒకింత కష్టపడినా.. తరుణ్ చుగ్ మాత్రం పెద్దగా ఎలాంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కాలేదు. అడపాదడపా సమావేశాలకు మినహా తెలంగాణకు వచ్చిన దాఖలాలు కూడా లేవు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఆయన తెలంగాణలో పర్యటించింది లేదు. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ఎన్నికల ఇన్ చార్జీగా కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను నియమించింది. దీంతో ఆయనే మొత్తం చూసుకున్నారు. కానీ, ఏమైనా సమస్య వస్తే చెప్పుకుందామన్నా ఇన్‌చార్జీ లేక శ్రేణులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో టీ బీజేపీకి ఇన్‌చార్జ్ ఉన్నట్టా? లేన్నటా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

టీబీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై కూడా ఇప్పటికీ ఎలాంటి ముందడుగు పడలేదు. కొద్దిరోజులుగా స్టేట్ ప్రెసిడెంట్ మార్పు ఖాయమని ప్రచారం జరిగినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉంటే హైకమాండ్ తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది. రాష్ట్రాలకు ఇన్ చార్జీలు, కో ఇన్ చార్జీలను ప్రకటించి తెలంగాణకు నియమించక పోవడం తో శ్రేణుల్లో సందిగ్ధత.. స్తబ్దత నెలకొంది. ఇన్‌చార్జీ ఉన్నా.. ఆయన నామమాత్రంగానే ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. టీబీజేపీకి దశ-దిశా లేకుండా పోయిందని చెబుతున్నారు. చుగ్ రాకపోవడంతో ఇన్ చార్జీగా ఆయన ఉన్నారా? లేక తొలగించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పటికైనా పార్టీ కొత్తవారిని నియమిస్తుందా? అని చర్చ జరుగుతోంది.


Similar News