హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్

18 మందితో కూడి సైబర్ నేరస్తుల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా 435 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు.

Update: 2024-10-06 06:14 GMT

దిశ, వెబ్ డెస్క్/ సిటీ క్రైం : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సైబర్ క్రైమ్ పీఎస్ కు రోజుకి సుమారు 10-15 కు పైగా సైబర్ ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిలో ఎక్కువగా కొరియర్ ఫ్రాడ్సే ఉంటున్నాయని పోలీసులు తెలిపారు. నెలకు సగటున 30 కోట్ల మేర సైబర్ మోసాలు జరుగుతున్నాయి. అమాయక ప్రజలే టార్గెట్ గా సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పించినా.. నేరస్తులు మాయమాటలు చెప్పి.. ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. అధికారులమంటూ ఫోన్లు చేసి.. లక్షలు, కోట్లలో దోచుకుంటున్నారు. ఈ క్రమంలో మూడు రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన హైదరాబాద్ పోలీసులు 18 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరంతా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన 435 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీస్ లు కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలలో ఆరు టీం ల తో స్పెషల్ ఆపరేషన్ ను నిర్వహించారు. సైబర్ నేరాల్లో ముగ్గురు మాస్టర్ మైండ్ ల తో పాటు మరో 18 మంది సైబర్ నేరగాళ్ళను పోలీస్ లు అరెస్ట్ చేసారు. తెలంగాణలో చేసిన మోసాల్లో రూ.6.94 కోట్లనగదును దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీబీఐ, ఈడీ అధికారులమని చెప్పి.. ప్రజలను బెదిరించి డబ్బు వసూళ్లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా నగ్నవీడియోలు బయటపెడతామని బెదిరించి కూడా వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పారు. వివిధ బ్యాంకుల్లో నిందితుల ఖాతాలో ఉన్న కోటిరూపాయలకు పైగా నగదును పోలీసులు ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 


Similar News