ఆ గ్రామానికి ఏమైంది..? 13 రోజుల వ్యవధిలో 11 మంది మృతి

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో సంభవించిన వరుస మరణాలు గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Update: 2024-08-02 02:55 GMT

దిశ, గద్వాల : ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో సంభవించిన వరుస మరణాలు గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేటిదొడ్డి మండలం కొండాపురంలో గ్రామంలో వరుస మరణాలతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. జూలై మాసంలో 13 రోజుల్లో వ్యవధిలో 11 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. గత నెల 20 నుంచి 31 వరకు మొత్తం 11 మంది మృతి చెందారు. చిన్న పిల్లల నుంచి వయోవృద్దుల వరకు చిన్న, పెద్ద తేడా లేకుండా వివిధ కారణాలతో మరణించారు. అనారోగ్యంతో కొందరు, ప్రమాదవశాత్తు కొందరు, ఆత్మహత్యతో ఒకరు మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

గోవిందు, వడ్డే సవారమ్మ వృద్ధాప్య సమస్యలతో మృతి చెందగా గోపాల్ అనే వ్యక్తి గుండెపోటుతో, వడ్డే నరసింహులు కరెంటు షాక్‌తో, సావిటికాడి సవారమ్మ, గురమ్మ, మన్యపు రెడ్డి, సాలప్ప, రఘు వేర్వేరు కారణా లతో మృతి చెందారు. ఈ మరణాలు మరవక ముందే గ్రామానికి చెందిన యువకుడు ప్రసాద్ హైదరాబాద్‌లో బుధవారం సూసైడ్ చేసుకున్నాడు. ఈ మరణాలు ఇలాగే కొనసాగుతాయా? అనే చర్చ గ్రామంలో తీవ్ర భయాందోళన రేపుతోంది. వరుస మరణాలు కలవరపెడుతున్నాయని, దీని నివారణ కోసం గ్రామస్తులమంతా హోమం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామంలో వరుస మరణాలతో గ్రామానికి ఏదో గాలి ఆవహించిదని ప్రచారం జరుగుతోంది. దాంతో గ్రామస్తుల్లో ఎవరూ చనిపోయినా భయాందోళనలకు గురవుతున్నారు. అయితే జులై నెల తమకు అచ్చిరాలేదని, ఆగస్టు నెల నుంచి అంత శుభం జరుగాలని గ్రామస్తులు సకలదేవతలను ప్రార్థిస్తున్నారు.

Tags:    

Similar News