త్వరలో దేవాదాయశాఖకు ప్రత్యేక యాప్

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ఒకే గొడుకు కిందకు తీసుకురాబోతున్నామని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు.

Update: 2024-10-22 17:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ఒకే గొడుకు కిందకు తీసుకురాబోతున్నామని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. సచివాలయంలో మంగళవారం దేవాదాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవాదాయశాఖ సమగ్ర వెబ్ సైట్‌ను తయారు చేయబోతున్నామని దర్శి బోర్డును రాష్ట్ర, జిల్లా వారీగా అందుబాటులోకి తెస్తామన్నారు. క్యూ ఆర్ కోడ్ సిస్టంతో భక్తులు తమ ఇష్టదైవం, దేవాలయాలకు సంబంధించిన చరిత్రను, స్థలపురాణాన్ని తెలుసుకోవడమే కాకుండా ఎక్కడి నుంచైనా వారు విరాళాలు ఆన్ లైన్‌లో ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

త్వరలోనే యాప్‌ను దేవాదాయశాఖకే ప్రత్యేకంగా తయారు చేయబోతున్నామన్నారు. దీనితో వారికి దగ్గరలో ఉన్న ప్రముఖ దేవాలయ వివరాలు, స్థలచరిత్ర, క్షేత్ర మహత్యం, పూజల వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. దీంతో టెంపుల్ టూరిజం అభివృద్ధికి బాటలు వేయనున్నట్లు తెలిపారు. భక్తులు సైతం దేవాలయ ఆవరణలో ఎక్కడైనా అపరిశుభ్రంగా ఉన్నా, చెత్తాచెదారం ఉన్నా ఫొటోలు తీసి అప్ లోడ్ చేస్తే అధికారులకు చేరుతుందని వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. పూజాసేవలు కావలనుకునే భక్తులు, అన్నదానం, డోనేషన్లు క్యూఆర్ కోడ్ తో ‘పే’ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ సమావేశంలో దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News