బీజేపీ త‌ల‌పెట్టిన ధ‌ర్నాను విర‌మించుకోవాల‌ని మంత్రి సీతక్క డిమాండ్

గ‌త పదేండ్లలో మూసీ ప్రక్షాళన, మూసీ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధి కోసం న‌యా పైసా కేటాయించ‌ని కేంద్ర ప్రభుత్వం ఎదుట, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి , బీజేపీ నేతలు ధర్నా చేయాలని మంత్రి సీత‌క్క డిమాండ్ చేశారు.

Update: 2024-10-22 17:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ‌త పదేండ్లలో మూసీ ప్రక్షాళన, మూసీ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధి కోసం న‌యా పైసా కేటాయించ‌ని కేంద్ర ప్రభుత్వం ఎదుట, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి , బీజేపీ నేతలు ధర్నా చేయాలని మంత్రి సీత‌క్క డిమాండ్ చేశారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం గుండా మూసీ పారుతున్నా ఏనాడు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేదని మండిపడ్డారు. కానీ ఇప్పుడు మూసీ ప్రాంత ప్రజల త‌రుఫున ధ‌ర్నాకు పిలుపునివ్వడం విచిత్రంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రాంత ప్రజల ప‌క్షాన ఈ నెల 25న ఇందిరా పార్క్ వ‌ద్ద బీజేపీ త‌ల‌పెట్టిన ధ‌ర్నాను విరమించుకోవాల‌ని మంత్రి సీత‌క్క మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. మూసీ పరివాహ‌క ప్రాంతంలో ముగ్గురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నందున‌..కేంద్రంతో చ‌ర్చించి హైద‌రాబాద్ జీవ‌న రేఖ‌గా భావించే మూసి పున‌రుజ్జీవ‌నం కోసం రూ. ప‌ది వేల కోట్ల ను మంజురు చేయించాల‌ని డిమాండ్ చేశారు.

రెండేళ్ల క్రితం వ‌ర‌ద‌ల్లో మూసీ ప్రాంత ప్రజలు నష్టపోయినప్పుడు బండికి బండి ఇస్తామ‌ని, ప్రతి ఇంటికి నష్ట పరిహారం అందిస్తామ‌ని హ‌మీ ఇచ్చిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఆ తర్వాత ఒక్కరిని కూడా ఆదుకోలేద‌ని మంత్రి సీత‌క్క గుర్తు చేశారు. ఇప్పుడు మూసీ ప్రాంత అభివృద్దిని అడ్డుకుంటూ బీజేపీ తన నైజాన్ని బ‌య‌ట‌పెట్టుకుంటుంద‌ని ఆరోపించారు. గుజ‌రాత్ లో స‌బర్మతి రివ‌ర్ ఫ్రంట్ ప్రాజెక్టును స‌మ‌ర్దిస్తున్న బీజేపీ...ఇక్కడ మూసీ అభివృద్ది ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు. మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టు స‌క్సెస్ అయ్యి హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిగే, ఇత‌ర న‌గ‌రాల‌ను దాటిపోతుందో అనే భ‌యం బీజేపీ నేత‌ల‌ను వేంటాడుతుందని చురకలు అంటించారు

గ‌త ప‌దేండ్లలో మూసీ కోసం ఒక్క పైసా కేటాయించ‌లేద‌ని కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి పార్లమెంట్ లోనే ప్రకటించినప్పుడు బీజేపీ నేత‌లు ఎందుకు మౌనంగా ఉన్నారు? అని నిలదీశారు. యూపీఏ హయాంలో మూసీ ప్రక్షాళన కోసం రూ. 335 కోట్లు మంజూరు అయితే, మోడి పాల‌న‌లో పైసా మంజూరు కాక‌పోయినా కిషన్ రెడ్డి ఎందుకు పెద‌వి విప్పలేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ మోడి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసి లోని గంగా ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు ఖ‌ర్చు చేసిందని గుర్తు చేశారు. దీంతో పాటు ఇతర నదుల ప్రక్షాళన కోసం 6 వేల‌ కోట్ల మంజూరు చేశారన్నారు. కానీ మూసీ కి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.


Similar News