బీసీల కోసం మాజీ ఎంపీ పోరాటం.. సబ్‌ప్లాన్‌పై సంచలన డిమాండ్
బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి చట్టబద్దత కల్పించాలని మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు..
దిశ, తెలంగాణ బ్యూరో: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు, అణగారిన వర్గాలకు కొత్త దారి చూపిన గొప్ప సామాజిక కార్యకర్త మహాత్మా జ్యోతిబాఫూలే పేరుతో బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి చట్టబద్దత కల్పించాలని మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్యగౌడ్ అన్నారు. గురువారం మహాత్మా జ్యోతిబా ఫూలే గారి వర్థంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం బూర నర్సయ్య గౌడ్ మాట్లాడారు. దేశంలో సామాజిక మార్పు జరగడానికి మూలకారకులు జ్యోతిబా పూలే గారు, అంబేద్కర్ అని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరరేషన్ లో బీసీలకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో మంత్రివర్గం, కార్పొరేషన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఆదరణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో కులగణన చేస్తామని చెప్పి, ఏడాదైనా పూర్తికాలేదన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లుకల్పిస్తామని మాయ మాటలు చెప్పి మోసం చేశారన్నారు. బీసీ వ్యాపారస్తులకు రూ. 10 లక్షల మేర పూచీకత్తు లేకుండా రుణాలిస్తామని మభ్యపెట్టి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ బీసీ,ఎస్సీ, ఎస్టీలకు మేలు చేసేలా పాలన అందిస్తున్నారన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని దేశానికి ప్రధానమంత్రిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టికే దక్కుతుందన్నారు.
మహాత్మా జ్యోతిబా పూలే, దొడ్డి కొమురయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్, శ్రీకాంతాచారి విగ్రహాలను ఆవిష్కరిస్తామని ఇప్పటి వరకు చేయలేదని నర్సయ్య గౌడ్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పురుగుల అన్నం తిని మరణిస్తున్నా సర్కార్ కు సోయిలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేలా బీసీ చైతన్య యాత్ర చేస్తామని చెప్పారు. అనంతరం బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ.. జ్యోతిబా పూలే భార్య సావిత్రిబాయి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది కులమతాలకు అతీతంగా విద్యనభ్యసించేలా మొదటి పాఠశాలను ప్రారంభించారన్నారు. వితంతువులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను గ్రహించి వారి కోసం ఆశ్రమాన్ని స్థాపించార న్నారు. అంధ విశ్వాసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మహానీయుడు జ్యోతిబాపూలే అని కొనియాడారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... 70 శాతం అణగారిన కులాలు, వెనుకబడిన సామాజిక వర్గాల వారి అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ పని చేస్తున్నారన్నారు. మోదీ క్యాబినెట్‌లో బీసీలకు 27శాతం, ఎస్సీలకు, 17, ఎస్టీలకు 9 నుంచి 10 శాతం ప్రత్యేక స్థానం కల్పించారని మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు.