ఐఏఎస్ శివశంకర్‌కు షాక్.. పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

పలువురు ఐఏఎస్ అధికారుల కేడర్‌ను ఖరారు చేస్తూ డీవోపీటీ (డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ ట్రెయినింగ్) ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లోతేటి శివశంకర్ (కడప జిల్లా కలెక్టర్) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.

Update: 2024-10-22 17:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పలువురు ఐఏఎస్ అధికారుల కేడర్‌ను ఖరారు చేస్తూ డీవోపీటీ (Department of Personnel Training) ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లోతేటి శివశంకర్ (Kadapa District Collector) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. కేడర్ విభజనలో తనకు అన్యాయం జరిగిందని, డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులు సహేతుకంగా లేవని ఆ పిటిషన్‌లో ఐఏఎస్ శివశంకర్ పేర్కొన్నారు. తెలంగాణకు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలని, ప్రస్తుతం పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోనే తనను కొనసాగించేలా వెసులుబాటు కల్పించాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఇదే విషయాన్ని ‘క్యాట్’ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్)లో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నానని, కానీ అనుకూల నిర్ణయం రాలేదని గుర్తుచేశారు. ‘క్యాట్’ ఉత్తర్వులను ప్రస్తావిస్తూ తగిన న్యాయం చేయాల్సిందిగా తెలంగాణ హైకోర్టును సైతం ఆశ్రయించానని, అక్కడ కూడా ప్రతికూల నిర్ణయమే వెలువడిందని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను జస్టిస్ హృశీకేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణకు తీసుకున్నది. ఐఏఎస్ ఆఫీసర్ శివశంకర్ తరఫు న్యాయవాది, డీవోపీటీ తరపున అదనపు సొలిసిటల్ జనరల్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే ‘క్యాట్’, తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులను ఇవ్వడంతో పాటు ఎందుకు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరించాయని పేర్కొన్న ధర్మాసనం... ఆ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోబోదని స్పష్టత ఇచ్చింది. డీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని శివశంకర్‌కు సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో కడప జిల్లా కలెక్టర్‌గా రిలీవ్ అయ్యి తెలంగాణ కేడర్‌గానే ఇకపైన పనిచేసే పరిస్థితి అనివార్యమైంది. తెలంగాణకు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు సైతం ‘క్యాట్’, తెలంగాణ హైకోర్టుల్లో దాఖలు చేసిన పిటిషన్లకు అనుకూల ఫలితం రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కేడర్‌గా ఇటీవలే జాయిన్ అయ్యారు. ఏపీలో పనిచేస్తున్న గుమ్మల్ల సృజన సైతం ఇటీవలే తెలంగాణలో జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు.

Tags:    

Similar News