CM Revanth Reddy : తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర సచివాలయ(Secretariat) ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Thalli)ఏర్పాటు పనులను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు.
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర సచివాలయ(Secretariat) ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Thalli)ఏర్పాటు పనులను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు పనులు చేస్తున్న కూలీలను పలకరించిన రేవంత్ రెడ్డి.. పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ పనుల పరిశీలనను రేవంత్ రెడ్డి ఎక్స్ లో పోస్టు చేశారు. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నాలుగు కోట్ల ప్రజల ప్రేమమూర్తి తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు శరవేగంగా జరుగుతోన్న పనులను ఈ రోజు పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ పవిత్ర కార్యంలో పాలుపంచుకుంటున్న శ్రమ జీవులతో పనులు జరుగుతున్న తీరు ఇతర అంశాలపై కాసేపు ముచ్చటించడం జరిగిందని ట్వీట్ చేశారు.
కాగా రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ఆగస్టు 28న సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. యూపీఏ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం ప్రకటన చేసిన రోజు..సోనియాగాంధీ జన్మిదినం.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన రోజైన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయని తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును తను చేసి చూపించాలని రేవంత్ రెడ్డి సంకల్పించారు. విగ్రహ రూపకల్పన బాధ్యతను జవహార్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ ఆండ్ ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కు అప్పగించారు.