మెడిసిన్స్ సప్లైపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అధికారులకు కీలక ఆదేశాలు
మెడిసిన్ సప్లై చెయిన్‌లో మూడు దశలను ఏర్పాటు చేయనున్నట్లు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. ...
దిశ, తెలంగాణ బ్యూరో: మెడిసిన్ సప్లై చెయిన్‌లో మూడు దశలను ఏర్పాటు చేయనున్నట్లు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. ఇండెంట్ దగ్గర్నుంచి పేషెంట్‌కు చేరే వరకు సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ జరిగేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. ప్రతి దశకు ఓ స్పెషలాఫీసర్‌ను నియమించాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన సెంట్రల్ మెడికల్ స్టోర్లు, ప్రభుత్వ దవాఖాన్లలో ఫార్మసీల బలోపేతం, ఫుడ్ సేఫ్టీ అంశాలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ ప్రస్తుతం ఈ ఔషదీ పోర్టల్ వినియోగంపై ఫార్మసిస్టుల అవగాహన కోసం వర్క్ షాపు నిర్వహించాలన్నారు. అవసరమైన మెడిసిన్, కావాల్సిన క్వాంటిటీతో హాస్పిటల్స్ నుంచి టీజీఎంఎస్‌ఐడీసీకి సకాలంలో ఇండెంట్ పెట్టాలని సూచించారు. మెడిసిన్ ప్రొక్యూర్ చేసిన తర్వాత, వెంటనే సీఎంఎస్‌లకు చేరాలని ఆదేశించారు. సీఎంఎస్‌లలో ఇప్పటికే కంప్యూటర్లు అందుబాటులోకి తీసుకొచ్చారని, ఈ నేపథ్యంలో సీఎంఎస్ ఇన్, అవుట్ స్టాక్ వివరాలను కచ్చితంగా ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయాలని సూచించారు. ఎంత క్వాంటిటి, మెడిసిన్ ఎవరికి ఇచ్చారో, వారి నుంచి రిసీవ్ సిగ్నేచర్లు తీసుకోవాలన్నారు. హాస్పిటల్స్‌లో ఉన్న మెడికల్ స్టోర్స్‌కు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, రద్దీ సమయాల్లో అదనంగా స్టాఫ్‌ను ఫార్మసీకి కేటాయించాలన్నారు. ఫార్మసీలో ఏయే మెడిసిన్ అందుబాటులో ఉన్నాయో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. జిల్లాల్లో మెడిసిన్ సప్లై మేనేజ్‌మెంట్‌కు డిప్యుటీ డీఎంహెచ్‌వోలను ఇంచార్జులుగా నియమించాలని మంత్రి ఆదేశించారు. హాస్పిటల్స్, సీఎంఎస్‌లలో మెడిసిన్ స్టాక్ వివరాలను రెగ్యులర్‌గా చెక్ చేయాలని, మెడిసిన్ కొరత లేకుండా చూడాలన్నారు. మెడిసిన్స్, మ్యాన్‌పవర్ సహా ఇంకేవైనా ప్రభుత్వం నుంచి కావాలంటే సమకూరుస్తామని, అధికారుల దగ్గరనుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకూ బాధ్యతగా పనిచేయాలని మంత్రి సూచించారు.
కొత్తగా 22 సీఎంఎస్...
ప్రభుత్వ దవాఖాన్ల కోసం కొనుగోలు చేసే మెడిసిన్ ఇండెంట్ దగ్గర్నుంచి, పేషెంట్‌కు చేరే వరకూ పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 22 సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ 22 సెంటర్ల ఏర్పాటుతో, ప్రతి జిల్లాకు ఒక సీఎంఎస్ అందుబాటులోకి వస్తున్నదని అధికారులు మంత్రికి వివరించారు. దవాఖాన్లలో మెడిసిన్ లేవంటూ గతంలో వచ్చిన వార్తలపై స్పందించిన మంత్రి, ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక టాస్క్‌ఫోర్స్ చొప్పున పది టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు అన్ని జిల్లాల్లోని హాస్పిటల్స్, సీఎంఎస్‌లను తనిఖీ చేసి నివేదిక తయారు చేశారు. ఈ నివేదికలోని అంశాలను అధికారులు మంత్రికి వివరించారు.