పండుగ పూట తీవ్ర విషాదం.. బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకుల మృతి
బతుకమ్మ దసరా పండుగ వచ్చింది. అందరూ సరదాగా కలిసి ఉంటూ కుటుంబ సభ్యులం అందరం కలిసుందామని ఆ కుటుంబాలు ఎన్నో కలలు కన్నారు.
దిశ, రాయపర్తి: బతుకమ్మ దసరా పండుగ వచ్చింది. అందరూ సరదాగా కలిసి ఉంటూ కుటుంబ సభ్యులం అందరం కలిసుందామని ఆ కుటుంబాలు ఎన్నో కలలు కన్నారు. కానీ విధి వారి కలలను కలలుగానే నిలిచి ఆ రెండు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది ఇద్దరు యువకులు బైకుపై వెళ్తూ మూలమలుపు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని కిష్టాపురం గ్రామ శివారు తోడేళ్ళ బండల వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామస్తులు స్థానిక ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కిస్టాపురం గ్రామానికి చెందిన ఎర్ర లలిత శ్రీనివాస్ దంపతుల కుమారుడు రాజు (20) ఈదునూరి కళ్యాణి యాకయ్య దంపతుల కుమారుడు బన్నీ (18)లు గురువారం సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. రాత్రి ఇద్దరు యువకులు కలిసి వెంటనే వస్తామని కుటుంబ సభ్యులకు చెప్పి.. ద్విచక్ర వాహనంపై కృష్టపురం నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో కాట్రపల్లి రోడ్డులో వాంకుడోత్ తండా క్రాస్ రోడ్డు తోడెల బండ మూల మలుపు వద్ద బైక్ అదుపుతప్పి పక్కన ఉన్న చెట్టుకు బలంగా ఢీకొట్టారు. దీంతో ప్రక్కనే ఉన్న పత్తి చేనులో పడి బైక్ పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలై లేవలేని స్థితిలో ఉండి అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా చూసి ఉంటే..
బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు చెట్టును ఢీకొట్టినప్పుడు ఎవరైనా చూసి ఉంటే వారి ప్రాణాలు బతికే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఇద్దరు కొన ఊపిరితో ఎంతోసేపు పోరాడినట్లు సంఘటన స్థలాన్ని చూస్తే అర్థమవుతుంది. ఈ రోడ్డుపై రాత్రిపూట ఎక్కువ వాహనాలు రాకపోకలు ఉండవు కాబట్టే వారిని ఎవరు గమనించలేదు.
పండుగ పూట కిష్టాపురంలో విషాదఛాయలు..
కుటుంబ సభ్యులతో సరదాగా ఆడి పాడి నడిపే వయసులో బైక్ పై వెళ్లి ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీకొని చనిపోవడంతో యువకుల తల్లిదండ్రులు వారి మృతదేహాలపై పడి విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ సంఘటనతో పండుగ పూట కృష్ణాపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రావణ్ కుమార్ మృతదేహాలకు పంచనామా నిర్వహించి మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.