దిశ, మరిపెడ : మహాబూబాబాద్ జిల్లాలో నూతన " గ్రీన్ ఫీల్డ్" నాలుగు వరసల జాతీయ రహాదారి నిర్మాణ సంస్థ "శ్రీ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ " వ్యవహారం వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తుంది. చెరువులు, గుట్టలల్లో నుండి అనుమతుల మాటున అధికమట్టి తరలింపు చేస్తోదని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఓ పోడు గుట్టను హాంఫట్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. తొర్రూర్ రేంజ్ లోనీ చిన్నముప్పారం గ్రామ శివారు లోని ఓ కంపార్ట్మెంట్ పరిధిలోని గుట్టను కొల్లగొట్టి జాతీయ రహాదారి నిర్మాణం కోసం మట్టిని తరలించారని అక్కడి గొర్ల కాపరులు,చుట్టుపక్కల రైతులు చెప్పుకొస్తున్నారు.
ఈ గ్రావెల్ దాదాపుగా మూడు రోజులు పగలు, రాత్రి తేడా లేకుండా రెండు ఎక్స్ వెయిటర్లు(పేద్ద జెసిబి) లతో ఐదు తెలంగాణ ఐదు తమిళనాడు రిజిస్ట్రేషన్ లతో లారీ/టిప్పర్లతో వందల ట్రిప్పుల మట్టి రవాణా సాగించినట్టు వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై దిశ పత్రిక ఆ ప్రాంతంలో పనిచేసే ఓ అధికారినీ సంప్రదించగా అవును జాతీయ రహదారికి మట్టి తరలిస్తుండగా తానే ఆపి వాటినీ పంపించినట్లు ఆయన తెలిపారు. ఐతే ఆ వెహికల్స్ ని పట్టుకొని సీజ్ చేయకుండా పంపించడంలో ఆంతర్యం ఏంటని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫారెస్ట్ మట్టిని ఆలేరు -వావిలాల గ్రామ శివారు పరిధిలో జాతీయ రహాదారి నిర్మాణానికి వినియోగించారని రెండు గ్రామాల ప్రజలు చెప్పుకొస్తున్నారు. అధికారులు ఫీల్డ్ ఎంక్వయిరీ చేస్తే ఈ మట్టి ఆనవాళ్ళని గుర్తుపట్టొచ్చని వారు అంటున్నారు.
వెహికల్స్ సీజ్ చేస్తారా?
ఈ వ్యవహారాన్ని క్లోజ్ చేస్తారా లేక తవ్విన మట్టికి మెజర్మెంట్ చేసి నామమాత్రంగా ఫైన్ కట్టించుకోని వదిలేస్తారా? లేక కఠిన చట్టాన్ని అమలుచేసి ఆ వాహానాలను సీజ్ చేస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా వుంది. ఏది ఏమైనప్పటికీ ఫారెస్ట్ అధికారులు జిల్లా బాస్ (DFO )మొదలుకొని ఫ్లయింగ్ స్క్వాడ్,ఎఫ్.ఆర్.వో లు మాత్రం ఈ వ్యవహారంపై చాలా సీరియస్ గా వున్నట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఆ సంస్థకు నోటీసులు ఇచ్చేందుకు ఫారెస్ట్ అధికారులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
ఫారెస్ట్ ల్యాండ్ నుండి మట్టి తరలించిన వ్యవహారం మా దృష్టికి వచ్చింది. విచారణకు ఆదేశించాను. తప్పు చేస్తే ఎవరినైనా వదిలిపెట్టేది లేదు. ఈ వ్యవహారం పట్ల చాలా సీరియస్ గా వున్నాం. అలాగే అక్కడి రైతులు పోడు వ్యవసాయం మాత్రమే చేసుకుంటున్నారు అంతేకానీ గుట్టను తవ్వు మట్టిని తీసుకువెళ్ళు అని చెప్పే హక్కు వారికి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.
-డి.ఫ్.ఓ విశాల్ బత్తుల