అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ ప్రావీణ్య
కుడా ఆధ్వర్యంలో చేపడుతున్న ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జంక్షన్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు.
దిశ, ఎల్కతుర్తి : కుడా ఆధ్వర్యంలో చేపడుతున్న ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జంక్షన్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. ఈ మార్గం గుండా వెళ్తున్న కలెక్టర్ మంగళవారం ఎల్కతుర్తి లో జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. మ్యాప్ ను పరిశీలించి వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. రోడ్లకు అన్నివైపులా మార్కింగ్ చేసి వీలైనంత త్వరగా పనులను ప్రారంభించాలని ఆదేశించారు. రాత్రిపూట ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. అలసత్వం వద్దని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. రోజువారీగా జరుగుతున్న పనులను వాట్సప్ గ్రూప్ లో వేయాలన్నారు. కరెంటు స్తంభాల తరలింపులో విద్యుత్ శాఖ అధికారులు తొందరగా చర్యలు చేపట్టాలని వివరించారు. ఎన్ హెచ్ ఎ ఐ అధికారులను కూడా సంప్రదించాలన్నారు. సంక్రాంతి పండుగ లోపు పనుల్లో పురోగతి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కూడా వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడే, ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఎంపీడీవో విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.