బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క
తాడ్వాయి మండలంలోని మొండ్యాల తోగు సమీపంలోని బ్లాక్ బెర్రీ దీవిని సోమవారం రాత్రి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క,
దిశ, ములుగు ప్రతినిధి: తాడ్వాయి మండలంలోని మొండ్యాల తోగు సమీపంలోని బ్లాక్ బెర్రీ దీవిని సోమవారం రాత్రి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర,ఐటిడిఎ పిఓ చిత్రా మిశ్రా, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ… ఇది ఆఫ్రికా అడవులు కాదు, అమెరికా అసలే కాదు, అమెజాన్ అడవి అంతకన్నా కాదు, ఇది మా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మొండ్యాల తోగు బ్లాక్ బెర్రీ దీవి అని మంత్రి సీతక్క అన్నారు.
జిల్లా కలెక్టర్ క్రూషల్ నిధుల ద్వారా అటవీ శాఖ ఏర్పాటు చేసిన బ్లాక్ బెర్రీ ఎంతో ముచ్చటగా ఉందని, పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే అవకాశం ఉందని అన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలోని పలు రకాల వనమూలికలను తాకుతూ ప్రవహిస్తున్న నీటిని సేవించడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, వ్యాధులను నయం చేయడమే కాక ఆయుష్షును పెంచుతుందని అభిప్రాయపడ్డారు. జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, దేశ విదేశీయుల పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చి దిద్దుతున్నామని అన్నారు. జిల్లా కేంద్రానికి ప్రవేశిస్తున్న సమయంలోనే గట్టమ్మ తల్లి ఉండడం, అక్కడి నుండి కొంత దూరం రాగానే యునెస్కో గుర్తింపు పొందిన 800 సంవత్సరాల నాటి రామప్ప ఆలయం సరస్సు పర్యాటకులను కనువిందు చేస్తున్నదని అన్నారు.
రామప్పలో 70 కోట్ల రూపాయలతో కాటేజీలో ఏర్పాటుతో పాటు ఐలాండ్ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని, అక్కడి నుండి కొంత దూరం రాగానే లక్నవరం సరస్సు, సరస్సులో ఉయ్యాల వంతెలతో పాటు మూడవ ఐలాండ్ ను సైతం ఇటీవలనే ప్రారంభించుకున్నామని వివరించారు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర, మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, గోదావరిపై అతిపెద్ద వంతెన, దానికి సమీపంలోనే బోగత జలపాతం లాంటి పర్యాటక ప్రాంతాలతో పాటు దైవభక్తి కలిగిన ఆలయాలు, దట్టమైన అడవి ప్రాంతాలు ఉన్నాయని అన్నారు. రానున్న రోజులలో ఏజెన్సీ గ్రామాల్లో ట్రైబల్ హట్స్ ను ఏర్పాటు చేయబోతున్నామని, జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై పాత్రికేయులు విస్తృతంగా ప్రచారం చేయాలని సీతక్క కోరారు.
పర్యాటకులను ఆకర్షించే విధంగా ములుగు జిల్లాలో అనేకమైన టూరిజం ను అభివృద్ధి చేసి చూపిస్తామని, ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే విధంగా మా ములుగు జిల్లా టూరిజం హబ్ గా ఉండటం మాకు గర్వకారణమని, మేము కూడా ఇలాంటి స్పట్లను గుర్తించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పం తో జిల్లా కలెక్టర్, డిఎఫ్ఓ ఇతర శాఖల అధికారులు పని చేస్తున్నారని, వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మన అందరిపైనా ఉందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్ ,మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.