ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ పథకాలను యువత సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.
దిశ, మహబూబాబాద్ టౌన్ : ప్రభుత్వ పథకాలను యువత సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ టీ ప్రైడ్ స్కీమ్ ద్వారా జిల్లాలోని 25 మంది ఎస్టీలకు రూ. 67 లక్షల 81 వేల 379, ఇద్దరు ఎస్సీలకు రూ. 5 లక్షల 73 వేల 165 నిధుల కేటాయింపు కోసం 27 మందికి సంబంధించి ప్రతిపాదనలు పంపామన్నారు.
జిల్లాలోని యువతీ, యువకులు వ్యాపార రంగాల్లో ప్రవేశించి ఉపాధి అవకాశాలను పొందాలని సూచించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్, పౌల్ట్రీ ఫామ్, రైస్ మిల్లు, జేసీబీ, లారీలు, చిల్లీ వ్యాపారం చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం ఏ.సత్యనారాయణ, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ నరేష్, ఎస్టీ, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్టీఓ సాయి చరణ్, సంబధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.