తాటికొండ రాజయ్య దోతిపైకి ఎక్కిన తొండ...

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను కచ్చితంగా అమలు చేయాలని, అదేవిధంగా రైతులకు ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతు ధర్నాలు చేపడుతున్నారు.

Update: 2024-10-04 16:58 GMT

దిశ, తొర్రూరు : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను కచ్చితంగా అమలు చేయాలని, అదేవిధంగా రైతులకు ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతు ధర్నాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో ముఖ్యఅతిథులుగా, మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మలోతు కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతుండగా స్టేజి పైకి ఒక్కసారిగా ఓ తొండ వచ్చింది. అయితే భయంతో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి పక్కకి జరగగా.. ఆ తొండకు భయపడతరా ? అంటూ తాటికొండ రాజయ్య నవ్వారు. వెంటనే ఆ తొండ నిలుచొని మాట్లాడుతున్న రాజయ్య దోతీ పైకి ఎక్కి షర్ట్ లోపల నుండి ఛాతీ వరకు వెళ్లింది. రాజయ్య ఓ చేత్తో మైక్ ను పట్టుకొని.. మరో చేత్తో తొండను షర్టుతో అదిమి పట్టుకున్నారు. పక్కనే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు కండువాతో తొండను బంధించి పక్కన విసిరేశారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. తొండలెక్కిచ్చి ఉరికిస్తాం అని ప్రసంగించిన టీఆర్ఎస్ నాయకులపైనే తొండలెక్కడం ఏమిటోనని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.


Similar News